కేసీఆర్ మాట నిలబెట్టుకో..
ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంచినందున ఒకేసారి మాఫీ చేయాలి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... సీఎం కేసీఆర్ మాట మీద నిలబడి ఒకేసారి పూర్తి రుణమాఫీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంచితే ఒకేసారి రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేశారని గుర్తుచేశారు. గురువారం కాంగ్రెస్ సీనియర్ నేతలు మధుయాష్కీ, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబులతో కలసి గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రూ.లక్ష వరకు ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. రెండేళ్లు పూర్తి కావస్తున్నా వాయిదాలు వేయడం తప్ప రైతులను రుణ విముక్తులను చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. కరువు తీవ్రత వల్ల గ్రామాల్లోనూ తాగునీటికి కటకట నెలకొందని, పశుగ్రాసం లేక పశువులను అమ్ముకుంటున్నారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలుచేయాలని... కూలీలకు పని కల్పించి, గ్రామాల నుంచి వలస పోకుండా నివారించాలని ఉత్తమ్ కోరారు.
పంచాంగం ఆవిష్కరణ: తెలంగాణ జాయింట్ స్ట్రగుల్ కమిటీ నేతృత్వంలో రూపొందించిన దుర్ముఖి నామ సంవత్సర పంచాంగాన్ని ఉత్తమ్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలను తెలియజేశారు.