మాఫీ నిధులిచ్చేందుకు మనసొప్పడం లేదా?
దేవరకొండ ‘రైతు రణభేరి’ద్వారా కేసీఆర్‌ను ప్రశ్నించిన ఉత్తమ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘అధికారంలోకి రాగానే రైతులకు రూ.లక్ష రుణమాఫీ అన్నా రు. మాట మార్చి విడతల వారీగా చెల్లిస్తామన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలవుతోంది. కానీ, మూడో దఫా రుణమాఫీ కింద రూ.4 వేల కోట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మనసొప్పడం లేదా? అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కేంద్రం ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఇచ్చిన రూ.980 కోట్లను కాంట్రాక్టర్లకు మళ్లించిన ప్రభుత్వం.. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ‘రైతు రణభేరి’ పేరిట గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన సభలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలోని 37లక్షల మంది రైతాంగాన్ని ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. మూడో విడత రుణమాఫీ కింద ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్ల నిధులను ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. రెండేళ్లలో ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, ఆరోగ్యశ్రీకి నిధులివ్వడం లేదని, కనీసం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లిం చేందుకూ ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న వారు కనీసం ఊరికో ఉద్యోగం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ‘ఇదేం ఖర్మో కానీ.. వీళ్లు అడుగుపెట్టిన దగ్గరి నుంచి తెలంగాణలో వ్యవసాయం భ్రష్టు పట్టిపోయింది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న చివరి ఏడాది తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులుంటే, గతేడాది 49 లక్షలకు తగ్గింది. ఇదేనా అభివృద్ధి?’ అని ఉత్తమ్ ప్రశ్నించారు. కరీంనగర్‌ను లండన్ చేస్తానని, హైదరాబాద్‌ను డ ల్లాస్ చేస్తానని, వరంగల్‌ను న్యూయార్క్ చేస్తానని, ట్యాంక్‌బండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు కట్టిస్తానని చెబుతున్న కేసీఆర్ గ్రామీణ తెలంగాణ గురించి పట్టించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శించారు. రైతు ఆత్మహత్యలను కూడా చెప్పుకోలేనంత నామోషీగా ఈ ప్రభుత్వం తీరు ఉందని దుయ్యబట్టారు. తప్పులను ఎండగడితే జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని, తనను ఏం చేసినా ఫర్వాలేదని, కాంగ్రెస్‌పార్టీ రైతాంగం పక్షాన నిలబడి పోరాడుతుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.
తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర లేదు: జానా
తెలంగాణను తీసుకురావడంలో కానీ, అభివృద్ధి చేయడంలోకానీ కేసీఆర్ పాత్ర ఏమీలేదని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అధికారులు పరుగెత్తికెళ్లి రూ.1.5 లక్షల పరిహారం ఇచ్చి ఆ కుటుం బాన్ని ఆదుకునేవారని, ఇప్పుడు రూ.6 లక్షలు ఇస్తామని మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పరిహారం చెల్లించలేదన్నారు. ప్రభుత్వానికి కళ్లు మూసుకుపోయాయని, రైతు రణభేరి ద్వారానైనా కనువిప్పు కలగాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ వైఎస్సార్ అధికారంలో ఉండగా, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిందే తడవుగా నక్కలగండి మంజూరు చేసి నల్లగొండ జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేసేం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిం దన్నారు. కానీ, ఇప్పుడు దానినే డిండి ఎత్తిపోతలగా మార్చి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంద న్నారు. మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యానాయక్, రైతు సంఘం నేత ఎం.కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.