
అప్పుల ఊబిలో రాష్ట్రం
అవాస్తవాలు, అంకెల గారడీతో బడ్జెట్: ఉత్తమ్
♦ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపాటు
♦ ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లేవి అని ప్రశ్న
♦ సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయేలా బడ్జెట్ ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. అబద్ధాలతో, అవాస్తవాలతో, అప్పుల లెక్కలతో, అంకెల గారడీతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అప్పులు తీసుకురావడమే అతిపెద్ద ఆదాయ వనరుగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చూపారని విమర్శించారు.
గతేడాది కూడా రూ.లక్షా 15 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారని, వాస్తవంగా రూ.లక్షకోట్లు కూడా దాటలేదని పేర్కొన్నారు. ఇప్పుడు రూ.లక్షా 30 వేలకోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినా వ్యవసాయాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అంత భారీ బడ్జెట్ అయినా రైతుల కష్టాన్ని గుర్తించి పూర్తి రుణమాఫీకి నిధులు కేటాయించలేదేమన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని కేంద్రం సవరించలేదని, దానివల్ల రూ.3వేలకోట్లు రాకపోవడంతో రుణమాఫీ చేయలేకపోతున్నామని చెప్పడం రైతుల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
దళితులకు భూపంపిణీకి నిధులేవీ?
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి భారీ పథకాలకు నిధులను బడ్జెట్‌లో కేటాయించకపోవడం ఏమిటని ఉత్తమ్ నిలదీశారు. కేవలం అప్పులపై ఆధారపడి ఈ పథకాలు చేపడతారా అని ప్రశ్నించారు. భూమిలేని దళితులకు మూడెకరాల భూమిని ఇవ్వడమే ప్రభుత్వ ప్రాధాన్యతా అంశమని సీఎం కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటనలు చేశారని.. మరి బడ్జెట్‌లో ఆ పథకానికి కేటాయింపులేవని నిలదీశారు. గిరిజన కుటుంబాలకు కూడా మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారని.. ఇప్పటిదాకా ఆ ప్రస్తావన కూడా లేదని పేర్కొన్నారు.
ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు వంటి విషయాలను అటు గవర్నర్ ప్రసంగంలోనూ, ఇటు బడ్జెట్‌లోనూ ప్రస్తావించలేదని... అబద్ధాలతో, అర్ధ సత్యాలతో, అభూత కల్పనలతో రూపకల్పన చేసిన బడ్జెట్ ఇదని వ్యాఖ్యానించారు. వాస్తవ దూరంగా ఉన్న ఈ బడ్జెట్‌లోని అంశాలపై సభలోనే ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఉత్తమ్ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు టెండర్లలో తాము ముందు నుంచి చెబుతున్నట్టుగానే కాంట్రాక్టు కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. టెండర్లు వేసిన కంపెనీలు అతి తక్కువ లెస్‌కు, కొన్ని పనులకు అంచనాల కంటే ఎక్కువధరకు కోట్ చేశాయని... కుమ్మక్కు అయినట్టుగా ఇంతకన్నా ఆధారాలు ఏముంటాయని పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్లు పెడితే ప్రభుత్వానికి కనీసం రూ.3వేల కోట్లు మిగిలేవన్నారు.