
బడ్జెట్ చిత్రం అట్టర్‌ఫ్లాప్
- ఆచరణలో నిల్
- బడ్జెట్ హామీలు ఆకాశంలో
- పనులు పాతాళంలో
- ఇదీ జీహెచ్‌ఎంసీ తీరు
సాక్షి, సిటీబ్యూరో : భారీ బడ్జెట్ చిత్రం అని ఊదరగొట్టి ఫ్లాప్ అయిన సినిమాలా ఉంది ‘గ్రేటర్’ వ్యవహారం. ఏటా భారీ బడ్జెట్‌ను ఆమోదించడం... పలు పనులు చేస్తామని హామీలు గుప్పించడం... పన్నులతో జనాన్ని బాదేయడం... పనులేం చేయలేక చతికిలపడటం... ఇదంతా జీహెచ్‌ఎంసీకి సర్వసాధారణమైపోయింది. ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యసాధనకు నెలవారీ, రోజువారీ టార్గెట్లతో ఉరుకులు, పరుగులు తీస్తున్న అధికార యంత్రాంగం.. ప్రజల కనీస అవసరాలను తీవ్రంగా విస్మరిస్తోంది.
రహదారులు, వీధిదీపాలు, ఆరోగ్యం, పారిశుధ్యం, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌లు, ఫ్లై ఓవర్లు.. ఇలా ఒక్కటనేమిటి..? ఎన్నో కల్పిస్తామని రంగుల కలలు సృష్టిస్తూ.. ఏటా దాదాపు రూ. 4000 కోట్ల బడ్జెట్ ను చూపుతోంది. కానీ అందులో కనీసం మూడోవంతు నిధులు కూడా ప్రజావసరాలకు ఖర్చు చేయడం లేదు. ప్రజల ముక్కుపిండి మరీ వివిధరకాల పన్నులు, ఫీజులు వసూలు చేయడంపై చూపుతున్న శ్రద్ధ.. మౌలిక సదుపాయాల కల్పనలో కనబరచక పోవడంతో నగర ప్రజలు నిత్యం పలు సమస్యలతో సతమతమవుతున్నారు.
పేరు గొప్ప.. ఊరు దిబ్బ
బడ్జెట్‌లో భారీ నిధులు చూపుతున్నప్పటికీ ఆ మేర ఖర్చు చేయడం లేదు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ. 3800 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించారు. ఇందులో రూ. 2979.98 కోట్లు ప్రజల సదుపాయాలకు, వారి సమస్యలు తీర్చే వివిధ పథకాల అమలు కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు రూ. 922.75 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. అంటే మూడోవంతు కూడా ఖర్చు చేయలేదు. త్వరలోనే ఆర్థిక సంవత్సరం ముగియనుంది. రేపోమాపో ఎన్నికల కోడ్ వెలువడితే.. ఇక ఎలాంటి ఖర్చు చేయలేని పరిస్థితి. ప్రకటించిన పనులన్నీ ఇంకెప్పుడు చేస్తారో మరి!
అంచనాలకు వాస్తవానికి వ్యత్యాసం
భారీ అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించడం.. అందులోసగం నిధులు కూడా ఖర్చు చేయలేకపోవడానికి మరో కారణం కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు, ఇతరత్రా నిధులు రాకపోవడం. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఖజానాకొచ్చే ఆదాయంలోనూ అంచనాలకు, వాస్తవానికి మధ్య వ్యత్యాసం ఉంటోంది. గ్రాంట్లుగా రూ. 820 కోట్లు రాగలవని అంచనా వేసినప్పటికీ, అందులో చాలా స్వల్ప నిధులు మాత్రమే వచ్చాయి. మొత్తంగా జీహెచ్‌ఎంసీకి రూపాయి రాక.. పోకలను పరిశీలిస్తే.. వివిధ మార్గాల ద్వారా రూ. 1720 కోట్లు ఖజానాకు చేరాయి. మొత్తం నిధుల్లోంచి ఆయా పనుల కోసం రూ.922 కోట్లు ఖర్చు చేశారు.
బడ్జెట్ హామీ.. అమలేదీ..?
నగర రహదారుల మెరుగుకు రూ. 976.30 కోట్ల పనులు చేస్తామన్నారు.
కానీ ఇప్పటివరకు రూ. 400 కోట్లు మించి చేయలేకపోయారు.
ట్రా‘ఫికర్’ను తప్పించే ఫ్లై ఓవర్లకు రూ. 86 కోట్లు ఖర్చు చేస్తామని.. రూ. 6 కోట్లే వెచ్చించారు.
నాలాల ఆధునీకరణకు రూ. 218 కోట్ల పనులు చేయాల్సి ఉండగా.. రూ. 89 కోట్లే ఖర్చు చేశారు.
పేదల గృహ నిర్మాణానికి రూ. 673 కోట్లు చూపినప్పటికీ.. రూ. 29 కోట్లే ఖర్చు పెట్టారు.
ఇలా.. హామీలు ఆకాశహర్మ్యాలను దాటినా పనులు పాతాళంలోనే ఉన్నాయి.