మీజిల్స్, రుబెల్లా నివారణకు టీకాలు
- దేశ వ్యాప్తంగా ఎంఆర్ టీకా కార్యక్రమం
- రాష్ట్రంలో ఆగస్టు 17 నుంచి మొదలు
- తొమ్మిది నెలలు నిండిన పిల్లలు... 15 ఏళ్లలోపు బాలలకు టీకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన మీజిల్స్(తట్టు), రుబెల్లా వ్యాధులను ఒకే టీకా (ఎంఆర్)తో నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), యునిసెఫ్ సహకారంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సామూహిక టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో ఆగస్టు 17 నుంచి ఎంఆర్ టీకా వేసే ప్రక్రియ మొదలు కానుంది. వివిధ దశల్లో దేశవ్యాప్తంగా ఈ టీకాలను వేయనున్నారు.
రాష్ట్రంలో సుమారు 90 లక్షల మంది పిల్లలకు ఈ టీకాలు వేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అన్ని రకాల ప్రభుత్వ ఆస్పత్రులలో ఎంఆర్ టీకాలు ఇస్తారు. తొమ్మిది నెలలు నిండిన, 15 ఏళ్లలోపు ఉన్న అందరు పిల్లలకు ఎంఆర్ టీకా ఇప్పించాల్సి ఉంటుంది. ఇతర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వారు, గతంలో మీజిల్స్, రుబెల్లా నివారణకు టీకాలు వేయిస్తే అలర్జీకి గురవైన వారు ఎంఆర్ టీకాను వేయించుకోకూడదు.
మీజిల్స్ లక్షణాలు: మీజిల్స్ వైరస్ ద్వారా సోకుతుంది. ప్రమాదకరమైన అంటు వ్యాధి. తీవ్ర జ్వరంతో ఎర్రటి దద్దుర్లు, దగ్గు, ముక్కు కారడం(జలుబు), కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు ఉంటాయి. ప్రధానంగా దగ్గడం, తుమ్మడం వల్ల వచ్చే తుంపర్లతో ఒకరి నుంచి మరొకరిని సోకుతుంది. అతిసారం, న్యుమోనియా, నోటి పూత, చెవి ఇన్‌ఫెక్షన్, కళ్లు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.
రుబెల్లా: నవజాత శిశువుల్లో అంధత్వం, వినికిడిలోపం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. రెబెల్లా వచ్చిన వారికి ఒళ్లంతా దద్దుర్లు కనిపిస్తాయి. ఒకసారి రుబెల్లా సోకిన వారికి గరిష్టంగా ఏడు రోజుల వరకు వైరస్ శరీరం మొత్తం ఉంటుంది.
దీన్ని అంతా ఎంతో ముఖ్యమైన చర్యగా భావించి టీకాను శ్రద్ధగా వేయించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ చిన్న పిల్లల తల్లిదండ్రులను కోరారు.