అది బినామీ కంపెనీయే: పనామా పత్రాలు
పనామా పత్రాలు బయటకొచ్చినప్పడే.. ఈ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్ అయిన మోటపర్తి శివరామ వరప్రసాద్(67)కు సంబంధించిన టోగోలోని వాసెం కంపెనీ గురించిన విస్తృత కథనాలు బయటకొచ్చాయి. వాసెమ్ కంపెనీలో బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న కెన్లెమ్ లిమిటెడ్కు 40 శాతం వాటా ఉన్నట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. అయితే కెన్లెమ్ లిమిటెడ్ కంపెనీలో 24 శాతం షేర్లు మోటపర్తి శివరామ ప్రసాద్వే ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఈ కెన్లెమ్ కంపెనీ యజమానులు వేరే ఉన్నారని పనామా పత్రాలు అనుమానం వ్యక్తం చేశాయి. దాంతో ఇది బినామీ పేర్ల మీద నడుస్తున్న కంపెనీ అని, దీని అసలు యజమానులు వేరే ఉన్నారని పనామా పత్రాలు వెల్లడించాయి.
టోగోలో ఉన్న వాసెం సిమెంటు కంపెనీలో 89 శాతం షేర్లు విదేశీయులవే అని, ఈ షేర్ హోల్డర్లలో ఒకరు మోటపర్తి శివరామ ప్రసాద్ అని పనామా పత్రాలు వెల్లడించాయి. నామమాత్రపు కంపెనీ పేరు మీద పన్నులు ఎగ్గొట్టారన్న ఆరోపణలు దీనిపై ఉన్నాయి. ప్రస్తుతం మోటపర్తి ఘనాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆర్థిక వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించి పన్ను ఎగ్గొట్టే లక్ష్యంతోనే బినామీల పేర్లమీద ఈ కంపెనీని ఏర్పాటు చేసినట్లు పనామా పత్రాలు పేర్కొన్నాయి. అయితే అక్కడ ఉన్న కంపెనీలలో 61 శాతం షేర్ హోల్డర్లు ఎవరనే విషయం టోగో వారికి తెలియదని పనామా పత్రాలు తెలిపాయి.