‘పైరవీ’ వీసీ!
► హెచ్‌సీయూ వీసీగా అప్పారావు నియామకానికి చక్రం తిప్పిన కేంద్రమంత్రి
► అనేక మంది సీనియర్లను కాదని అప్పారావుకు బాధ్యతలు
► సెర్చ్ కమిటీ తుది జాబితాలో ప్రస్తుత వీసీ పేరు చూసి ఆశ్చర్యపోయిన సీనియర్లు..
► అతను చీఫ్ వార్డెన్‌గా ఉన్నప్పటికే ప్రొఫెసర్లుగా ఉన్నవారికి కూడా రాని అవకాశం
► తుది జాబితాలో సీసీఎంబీ మాజీ డెరైక్టర్ మోహన్‌రావు, జేఎన్టీయూ మాజీ వీసీ డీఎన్ రెడ్డి.. వారిని కాదని అప్పారావుకు చాన్స్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ నియామకంలో కేంద్ర మంత్రి ఒకరు చక్రం తిప్పిన విషయం బయటపడింది. ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 16 మంది సీనియర్ ప్రొఫెసర్లను పక్కనబెట్టి వారందరికంటే జూనియర్ అయిన పి.అప్పారావు వైస్ చాన్స్‌లర్ అయ్యేలా ఆ మంత్రి తన పలుకుబడిని ఉపయోగించారు.
ఆఖరుకు సెర్చ్ కమిటీ సిఫారసు చేసిన ఐదుగురిలో ఏరకంగా చూసినా అప్పారావు అర్హతలు తక్కువేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయినా ఆయనకు వీసీగా ‘అవకాశం’ వచ్చింది. ఢిల్లీ స్థాయిలో అండదండలు ఉండడం వల్లే తాను వీసీ అయ్యానని అప్పారావు పలుమార్లు తన సన్నిహితులతోను, సహచర ప్రొఫెసర్లతోనూ చెప్పుకొన్నారు కూడా.
రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ నియామకంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఉదంతం అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన ద్విసభ్య కమిటీ సైతం వైస్ చాన్స్‌లర్ నియామక ప్రకియకు సంబంధించిన ఫైల్‌ను పరిశీలించింది. హెచ్‌సీయూలో బోధనా సిబ్బంది కొందరు ఇచ్చిన సమాచారం మేరకు.. కమిటీ ఆ ఫైల్‌ను పరిశీలించినట్లు అత్యున్నత అధికార వర్గాలు ధ్రువీకరించాయి. మొత్తంగా వైస్ చాన్స్‌లర్ వ్యవహారశైలి బాగా లేకపోవడం వల్లే వర్సిటీలో విపరీత పోకడలు చోటు చేసుకున్నాయని ద్విసభ్య కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఈ కమిటీ సభ్యులు గురువారం ఢిల్లీలో మానవ వనరుల శాఖ కార్యదర్శికి తమ నివేదికను అందజేశారు.
జూనియర్ అయినా..
హెచ్‌సీయూ వీసీ నియామకం కోసం కేంద్ర మానవ వనరుల శాఖ గతేడాది జూలైలో సెర్చ్ కమిటీని నియమించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇవ్వగా 190 దరఖాస్తులు వచ్చాయి. వాటన్నిటినీ వడపోసిన కమిటీ 21 మందిని జాబితాలో పెట్టింది. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 17 మంది హెచ్‌సీయూలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు. వారందరిలోనూ ప్రస్తుత వీసీ అప్పారావు జూనియర్ అని విశ్వవిద్యాలయ బోధనా సిబ్బంది పేర్కొంటున్నారు.
ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితాలో చోటు దక్కని మరో 17 మంది కూడా అప్పారావు కంటే సీనియర్లని ఓ ప్రొఫెసర్ ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. సెర్చ్ కమిటీ ఈ వర్సిటీకి చెందిన 17 మందితో పాటు బయటి వ్యక్తులు నలుగురిని ఇంటర్వ్యూ చేసింది. చివరగా ఎవరి పేర్లు సిఫారసు చేయాలన్న విషయంలోనూ మానవ వనరుల శాఖ ఆదేశాల మేరకు సెర్చ్ కమిటీ నడుచుకున్నదని పేరు చెప్పేందుకు ఇష్టపడని సీనియర్ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు.
‘‘మా పేరు లేకపోయినా ఫరవాలేదు. కానీ తుది జాబితాలో అప్పారావు పేరు చూసి మేం షాకయ్యాం. మాలో చాలా మంది కంటే ఆయన జూనియర్. ఆయన చీఫ్ వార్డెన్‌గా పనిచేస్తున్న రోజుల్లోనే మేం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాం. ఆయన పేరు జాబితాలో ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. ఆ తరువాత తెలిసిందేమంటే కేంద్ర మంత్రి ఒకరు ఆయనకు సన్నిహిత బంధువు..’’ అని ఆయన తెలిపారు.
చక్రం తిప్పిన కేంద్ర మంత్రి
హెచ్‌సీయూ వీసీ నియామకం కోసం సెర్చ్ కమిటీ ఐదుగురి పేర్లను మానవ వనరుల శాఖకు సిఫారసు చేసింది. ఇందులో దేశంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన ‘సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ)’ డెరైక్టర్‌గా పనిచేసిన మోహన్‌రావు, ‘జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)’ మాజీ వీసీ డీఎన్ రెడ్డి ఉన్నారు. ఏరకంగా చూసినా అప్పారావు కంటే వారిద్దరూ సీనియర్లు. కానీ వారిని కాదని అప్పారావుకు వీసీ పదవి వచ్చేలా కేంద్ర మంత్రి చక్రం తిప్పారు.
ఆ కేంద్ర మంత్రితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అప్పారావు నియామకానికి తన వంతు సహకారం అందించినట్లు హెచ్‌సీయూ ప్రొఫెసర్లు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అండదండలు ఉన్నందువల్లే అప్పారావు విశ్వవిద్యాలయంలో గొడవలను పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఏబీవీపీ అంటే వీసీకి ప్రత్యేకమైన అభిమానం లేనప్పటికీ, తన సామాజికవర్గం వారికి అన్ని రకాల అండదండలు ఇవ్వడంలో అర్హులైన ఇతరులకు అన్యాయం చేశారని ఓ సీనియర్ ప్రొఫెసర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి మానవ వనరుల శాఖకు లేఖ రాసినా ఇప్పటివరకూ వారి నుంచి ఏ రకమైన సమాచారం రాలేదన్నారు.