కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దుపై విమర్శలొచ్చినా కీలకమైన ఈ సంస్కరణతో బెడ్‌రూంలు, బాత్‌రూంలు, మెత్తల (దిండ్లు) కింది డబ్బు బ్యాంకులకు చేరిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇందులో నల్లధనమెంతో, తెల్లధనమెంతో రిజర్వు బ్యాంకు విశ్లేషణ చేయాలన్నారు. సంస్కరణల అమలులో స్వల్పకాలిక కష్టాలు తప్పవన్న వెంకయ్య.. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో దేశంలో అవినీతి, పన్ను ఎగవేత తగ్గుతాయని పేర్కొన్నారు. బిల్లులు లేకుండా, ఆన్‌లైన్‌లో లావాదేవీలు నమోదు చేయకుండా వ్యాపారం చేయడం ఇప్పుడు కుదరదని, జీఎస్టీతో పన్ను వసూలు పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. సమాఖ్య వ్యవస్థ విజయానికి జీఎస్టీ అమలు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
మంగళవారం హైదరాబాద్‌లోని కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ఫైనాన్స్, మార్కెటింగ్, పన్ను విధానం–సమకాలీన పరిస్థితులు, సవాళ్లు’అంశంపై నిర్వహించిన 2 రోజుల జాతీయ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య.. సెమినార్‌ను ప్రారం భించి ప్రసంగించారు. పన్ను చెల్లింపు ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రభుత్వాలకు ఆదాయం రాకపోతే సంక్షేమ కార్యక్రమాల అమలు కష్టమవుతుందని చెప్పారు. పన్ను చెల్లింపు పరపతి పెరిగినపుడు, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నపుడు ప్రజలపై పన్నులు, భారాలు తగ్గుతాయని వ్యాఖ్యానించారు. పేదరికం, నిరక్షరాస్యత, విధ్వంసం, వివక్ష, అవినీతి, హింస, తీవ్రవాదం నుంచి విముక్తి పొందినపుడే నిజమైన స్వాతంత్య్రం లభించినట్లని.. గతం నుంచి పాఠాలు నేర్చుకుని ఆ దిశలో మరింత వేగంగా ముందుకెళ్లాలని సూచించారు.
ప్రపంచమంతా భారత్‌వైపు..
ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ అంచనాల మేరకు 2018లో స్థూల జాతీయోత్పత్తి 7.3 శాతం నమోదవుతుందని, రానున్న 15 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని చెప్పారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని, వచ్చే మూడేళ్లలో ఆర్థిక వృద్ధి రేటులో చైనాను భారత్ మించిపోతుందన్నారు. విద్యార్థులకు డిగ్రీలిస్తే సరిపోదని, జీవితంతో పాటు విద్యలోనూ నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిపూర్ణంగా తీర్చిదిద్దాలన్నారు. సిలబస్‌లో మార్పులు చేయాలని, సమకాలీన అంశాలపై బోధన జరగాలని అభిప్రాయపడ్డారు. సెమినార్‌కు కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు, రిటైర్డ్ జడ్జి జస్టిస్ నర్సింహారెడ్డి అధ్యక్షత వహించగా.. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఉస్మానియా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ రామచంద్రం, యూజీసీ సభ్యుడు గోపాల్‌రెడ్డి, కేశవ్ సొసైటీ ఉపాధ్యక్షుడు నర్సింహారావు, శ్రీధర్‌రెడ్డి, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, సెమినార్ కన్వీనర్ నీరజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment