తేరుకుంటున్న నగరం
ఇంకా ముంపులోనే పలు కాలనీలు
* సహాయక చర్యలు ముమ్మరం
* బాధితులకు ఆహారం, నీరు అందిస్తున్న ఆర్మీ, జీహెచ్‌ఎంసీ బృందాలు
సాక్షి, హైదరాబాద్: కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ నగరంలో ఆదివారం వర్షం కాస్త తెరిపినిచ్చింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం తొలగి కాస్త ఉపశమనం లభించింది. భారీ వర్షాలకు నిండా మునిగిన నిజాంపేట్‌లోని భండారీ లే అవుట్‌లో ఇంకా 25 అపార్ట్‌మెంట్లు వరద నీటిలోనే ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించకపోవడంతో వాటిల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, స్వచ్ఛంద సంస్థలు ఆహారం, మంచినీరు, మందులు అందజేస్తున్నాయి.
ఇక దూలపల్లి, కొంపల్లి, గుండ్లపోచంపల్లి చెరువులు అలుగుపోస్తుండడంతో కొంపల్లి పరిధిలోని ఉమామహేశ్వర కాలనీ నుంచి 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఫాక్స్ సాగర్‌కు ఎగువ భాగంలో ఉన్న ప్రాంతంలో 160 ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ఇక అల్వాల్‌లోని రెడ్డి ఎన్‌క్లేవ్, శ్రీనివాసనగర్, భారతినగర్, వెంకటాపురం, భూదేవినగర్, శివనగర్, తుర్కపల్లి ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ఉంది. బేగంపేట్ నాలాకు ఆనుకుని ఉన్న అల్లంతోట బావి ప్రాంతం ముంపులోనే ఉంది. ఆర్మీ, జీహెచ్‌ఎంసీ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.
మరిన్ని రోజులు వానలు..
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా అల్పపీడన ప్రభావంతో ముసురు వీడలేదు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు పలు చోట్ల కుండపోత వాన కురిసింది. హకీంపేట్‌లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 4.1, కుత్బుల్లాపూర్‌లో 4, బొల్లారంలో 3.5, చిలకలగూడలో 2.1, బేగంపేట్‌లో 1.7, సరూర్‌నగర్‌లో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో సోమ, మంగళవారాల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఇక హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. నగరానికి ఆనుకుని ఉన్న గండిపేట్ (ఉస్మాన్‌సాగర్) జలాశయం గరిష్ట మట్టం 1790 అడుగులకుగాను ఆదివారం సాయంత్రానికి 1779 అడుగుల నీటిమట్టం నమోదైంది. హిమాయత్‌సాగర్ జలాశయం గరిష్ట మట్టం 1763.5 అడుగులకుగాను 1743 అడుగుల వరకు నీరు చేరింది. ఎగువన వర్షాలు తగ్గడంతో వరద క్రమంగా తగ్గుముఖం పడుతోందని జలమండలి అధికారులు తెలిపారు.