టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి విజయరామారావు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి విజయరామారావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.విజయరామారావుకు, కేసీఆర్ టీఆర్ఎస్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపా హయాంలో విజయరామారావు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా పనిచేశారు.
తెలంగాణ పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విజయరామారావును ఆయన నివాసంలో కలుసుకొని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి విజయరామారావును బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది.
కాగా ఇటీవలే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గులాబీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఐదుగురు ఎమ్మెల్యేలు ఇదే తరహాలో పార్టీ మారారు. పార్టీలో ముఖ్య నేతగా పేరున్న మాజీ మంత్రి కె.విజయరామారావు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పడంతో తెలంగాణ టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.