vijaya rama rao
-
బాలాలయానికి సరస్వతీ అమ్మవారు!
భైంసా: సరస్వతీ దేవి కొలువైన బాసర ప్రధాన ఆలయం పునర్నీర్మాణానికి కసరత్తు పూర్తయింది. ఇప్పటికే అర్చకులు, అధికారులు, వైదిక బృందం శృంగేరి వెళ్లి పీఠాధిపతి విదుశేఖర భారతిస్వామి సూచనలతో నమూనా రూపొందించారు. గర్భగుడిలో మార్పులు చేర్పులపై పీఠాధిపతి చేసిన సూచనలను ఆలయ ఈవో విజయరామారావు, ఆలయ ప్రధాన పండితులు.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డికి వివరించారు. కొత్త నమూనాలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరమైన బాసర ఆలయానికి రూ.50 కోట్ల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా భక్తులు వచ్చే ఈ క్షేత్రంలో అనునిత్యం అక్షరాభ్యాస పూజలు జరుగుతాయి. వేలాదిగా భక్తులు బాసర వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో పునర్నీర్మాణ పనులు ప్రారంభమైతే ప్రస్తుతం ఉన్న ప్రధానాలయం వద్ద భక్తుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. పనుల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అక్షర శ్రీకార మండపాన్ని బాలాలయంగా ఏర్పాటుచేసి అమ్మవారికి పూజలు నిర్వహించనున్నారు. విశాలమైన ఈ మండపంలో ప్రధానాలయం గర్భగుడి పనులు పూర్తయ్యేవరకు అమ్మవారి దర్శనాలు, అక్షరాభ్యాస పూజలు ఇక్కడే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు ముందే ప్రారంభించేలా.. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఆలయ పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి పలు దఫాలుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించి నూతన నమూనాలు, మాస్టర్‌ప్లాన్ తదితరాలపై కసరత్తు పూర్తి చేశారు. ఇటీవల బాసర వచి్చన మంత్రి మాస్టర్ ప్లాన్ అమలుపై ఆలయ అధికారులతో చర్చించారు. కృష్ణ శిలలతో నిర్మాణం... గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం సరస్వతి అమ్మవారి దర్శన సమయంలో పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించదు. రానున్న రోజుల్లో మహాలక్ష్మి అమ్మవారు కనిపించేలా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నారు. మహంకాళి అమ్మవారి ప్రతిమ వెనుక ప్రాకార మండపం, ప్రాకారం లోపల శివాలయ పునః ప్రతిష్ట, దత్తాత్రేయ స్వామివారి స్థల మారి్పడి, నలుదిక్కులా రాజగోపురాల నిర్మాణం, అనివేటి మండప విస్తరణ, ద్వజ స్తంభం ఏర్పాటు, ఆలయ ప్రాంగణంలోనే యాగశాల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు. -
సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎల్లుండి మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. విజయరామారావు మాజీ ఎమ్మెల్యే కూడా. సర్వీస్ నుంచి రిటైర్డ్ అయ్యాక.. టీడీపీలో చేరి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్(హైదరాబాద్) నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పీ జనార్థన్‌రెడ్డి మీద విజయం సాధించారు. ఆ వెంటనే కేబినెట్లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి దానం నాగేందర్(కాంగ్రెస్) చేతిలో ఓడారు. విజయరామారావు పుట్టింది వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారంలో!. అయితే కుటుంబ మూలాలున్న ఏపీలోనే(నెల్లూరు) ఉన్నత చదువులు సాగాయి. పైచదువులకు మద్రాసు యూనివర్సిటీలో చేరి బీఏ చేశారు. ఆపై 1958 అక్టోబరులో కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో లెక్చరర్ ఉద్యోగంలో చేరాడు. ఆ మరుసటి ఏడాదే సివిల్స్ అర్హత సాధించి.. ట్రైనింగ్తర్వాత చిత్తూరు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డైరెక్టర్‌గా హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచర్యం కేసు,ముంబై బాంబు పేలుళ్లు లాంటి ప్రముఖ కేసులను దర్యాప్తు చేశారు. -
బ్రోకర్లు, రౌడీషీటర్లు, గూండాలకు టికెట్లిచ్చారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీలో బ్రోకర్లు, గూండాలు, రౌడీషీటర్లకు టికెట్లు కేటాయించారని మాజీమంత్రులు బోడ జనార్దన్, విజయరామారావు సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ కోసం ఐదేళ్లుగా కష్టపడిన తమను కాదని పారాచూట్లకు టికెట్లు అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ టికెట్లు రాని ఆశావహులతో కలసి తెలంగాణ రెబెల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో జనార్దన్, విజయరామారావు, ధర్మపురి టికెట్ ఆశించిన మద్దాల రవీందర్ మాట్లాడారు. టికెట్ల కోసం పార్టీలోకి వచ్చినవారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించవద్దని రాహుల్ ఎన్నో సభల్లో, సమావేశాల్లో సూచించినా ఉత్తమ్, ఆర్.సి.కుంతియా టికెట్ల కోసం బేరమాడి, ఎంత ఖర్చు పెడతారో చెప్పాలంటూ అభ్యర్థిత్వాలను అమ్ముకున్నారన్నారు. తమ వద్ద ఆధారాలున్నాయని త్వరలోనే వాటిని బయటపెడతామన్నారు. పార్టీ సభ్యత్వంలేని 19 మందికి టికెట్లు అమ్ముకున్నారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కావాలనే అభ్యర్థుల జాబితాను లీక్ చేసి, తర్వాత మీడియాలో వచ్చింది నమ్మవద్దంటూ చెప్పారని, తీరా అదే జాబితా అధికారికంగా వెలువడటం వెనుక ఎన్నికోట్లు చేతులు మారాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 40 మందితో రెబెల్స్ ఫ్రంట్ జాబితా... తెలంగాణ ఇచ్చినందుకు సోనియా రుణం తీర్చుకోవాల్సిన తాము రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరామని, ముందస్తు ఎన్నికల నాటికి తామే అభ్యర్థులుగా ఉన్నామని జనార్దన్ అన్నారు. తీరా ఎన్నికలు దగ్గరపడేసరికి పారాచూట్లకు టికెట్లను అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారాచూట్లకు టికెట్లుండవని రాహుల్ చెప్తుంటే ఉత్తమ్, కుంతియా, భట్టి విక్రమార్క మహాకూటమి పేరుతో మాయకూటమి పెట్టి టికెట్లు అమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్ గెలవాల్సిన చోట ఓడిపోయే వ్యక్తులను నిలుచోబెట్టి పార్టికి నష్టం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడినా టికెట్లు రాని 40 మంది అభ్యర్థులతో తాము తెలంగాణ రెబల్స్ ఫ్రంట్‌గా ఏర్పడుతున్నామని వెల్లడించారు. రెండు రోజుల్లో రెబల్స్ జాబితా విడుదలు చేస్తామని తెలిపారు. నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తికి టికెటిస్తారా? కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి నాలుగు సార్లు ఓడిపోయిన వ్యక్తి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మళ్లీ టికెట్ ఇవ్వడం రాహుల్ గాంధీ పెట్టిన నిబంధనలకు విరుద్ధమని రవీందర్ అన్నారు. స్క్రీనింగ్, కోర్ కమిటీ సమావేశాల్లో తన లాంటి స్థానిక నేతలు, యువకుల పేర్లు తుదిదశలో పరిశీలనకు వచ్చినా, వాటిని పక్కన పెట్టి ఉత్తమ్, కుంతియా, మరికొందరు సీనియర్లు టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. రెబెల్స్ఫ్రంట్ తరపున ధర్మపురి నుంచి పోటీ చేస్తున్నట్టు రవీందర్ చెప్పారు. -
వెంటాడుతున్న రుణం
-
విజయరామారావు కుమారుడి నివాసంలో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విభాగం సోమవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరులోనూ తనిఖీలు చేసింది. కర్ణాటకకు చెందిన ప్రముఖ బ్యాంకు నుంచి ఆయన రూ. 315 కోట్ల రుణం తీసుకుని చెల్లించలేదు. దీంతో ఆ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు గతంలోనే శ్రీనివాస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఉన్న ఆధారాల మేరకు ఈడీ అధికారులు సోమవారం హైదరాబాద్, బెంగళూరుల్లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసినట్లు తెలిసింది. -
టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి విజయరామారావు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి విజయరామారావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.విజయరామారావుకు, కేసీఆర్ టీఆర్ఎస్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపా హయాంలో విజయరామారావు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా పనిచేశారు. తెలంగాణ పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విజయరామారావును ఆయన నివాసంలో కలుసుకొని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి విజయరామారావును బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. కాగా ఇటీవలే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గులాబీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఐదుగురు ఎమ్మెల్యేలు ఇదే తరహాలో పార్టీ మారారు. పార్టీలో ముఖ్య నేతగా పేరున్న మాజీ మంత్రి కె.విజయరామారావు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పడంతో తెలంగాణ టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
'బొల్లారం' నిందితుడికి రిమాండ్, ఎమ్మెల్యేపై కేసు నమోదు!
హైదరాబాద్: నగర శివారులోని బొల్లారంలో భారీగా పట్టుబడ్డ డబ్బు కేసులో నిందితుడు రాజమౌళిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో విజయరమణారావుతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితుడు రాజమౌళికి డబ్బు నాగరాజు అనే వ్యక్తి అందచేసినట్టు, ఆతర్వాత డబ్బు రాజమౌళికి ఇచ్చినట్లు విజయరమణారావుకు నాగరాజు ఫోన్ చేసి చెప్పినట్టు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో వివరాలను సేకరించడానికి రాజమౌళి సెల్ పోన్ కాల్‌డేటాపై పోలీసులు దృష్టి సారించారు. కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు వ్యక్తిగత సహాయకుడు రాజమౌళిచారి అలియాస్ రమేశ్ రూ.90 లక్షల నగదును తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో పంచిపెట్టేందుకే తెలుగు తమ్ముళ్లు ఈ నగదు తరలిస్తున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం విజయరమణారావు పెద్దపల్లి నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. -
శివపల్లిలో కోడిపందేలపై.. ఎస్పీ సీరియస్
పెద్దపల్లి, న్యూస్‌లైన్ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎలిగేడ్ మండలం శివపల్లిలో బుధవారం నిర్వహించిన కోడిపందే లపై ఎస్పీ శివకుమార్ సీరియస్ అయ్యారు. పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్.విజయరమణారావుతోపాటు వేలాది మంది ఈ పందేల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుల్తానాబాద్ స్టేషన్‌కు, 8కిలోమీటర్ల దూరంలో ఉన్న జూలపల్లి పోలీసులకు కోడి పందేల గురించి తెలియకపోవడంపై ఎస్పీ మండిపడినట్లు సమాచారం. దీనిపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాల్సిం దిగా పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావును ఆదేశించినట్లు తెలిసింది. -
మతలబేందో!
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని శ్రీధర్‌బాబు నివాసంలో ఆయనను కలుసుకొని, రెండు గంటలపాటు మంతనాలు జరిపారు. సాధారణ ఎన్నికలు సమీపించిన తరుణంలో, రాజకీయ సమీకరణాలు మారుతాయనే ప్రచారం నేపథ్యంలో వీరి భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలో భారీ మార్పులకు సంకే తంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా, అలాంటిదేమీ లేదని టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసినందుకే శ్రీధర్‌బాబును కలిసారా.. లేక రాజకీయ మతలబు ఏదైనా ఉందా అనే కోణంలో టీడీపీ వర్గాలు కూడా ఆరాతీస్తున్నాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలువగా, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ మారడంతో ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య ముగ్గురికి పడిపోయింది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌లోకి వెళుతారనే వాదన ఉంది. గతంలో పార్టీ మారేందుకు దేవయ్య తన నివాసంలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కావడం తెలిసిందే. కార్యకర్తలు వ్యతిరేకించడంతో అప్పట్లో చేరికను విరమించుకున్న దేవయ్య ఆ తరువాత పార్టీ మారడాన్ని ఖండిస్తూ వచ్చారు. జిల్లాలో టీడీపీకి పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడంతో విజయరమణారావు కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుండగా, ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. తాజాగా మంత్రి శ్రీధర్‌బాబుతో వీరిరువురు భేటీ కావడంతో మరోసారి పార్టీ మార్పు అంశం తెరపైకి వచ్చి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీని వీడేది లేదు : విజయరమణారావు తాను కరుడుగట్టిన టీడీపీ వాదినని, ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీని వీడేది లేదని చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు. మంగ ళవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ వ్యక్తిగత పని నిమిత్తం తాను, దేవయ్య శ్రీధర్‌బాబును కలిశామే తప్ప రాజకీయంగా ప్రాధాన్యత లేదన్నారు. మంత్రి కాబట్టే శ్రీధర్‌బాబును కలిశామని, తమతోపాటు టీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారన్నారు. కచ్చితంగా బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుందని, తమకు పార్టీ మారాల్సిన అవసరం కూడా లేదన్నారు.