
స్థానిక సమస్యలపై సమరం
- టీజేఏసీ ముఖ్యుల సమావేశంలో నిర్ణయం
- కొత్త జిల్లాల్లో సమస్యల గుర్తింపుపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన జిల్లాలను ప్రజల్లో చైతన్యానికి, సమస్యలపై పోరా టాలకు అనుకూలంగా వాడుకోవచ్చని తెలంగాణ జేఏసీ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్త సమ స్యల పరిష్కారంకోసం పోరాడుతూనే జిల్లాల వారీగా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కా రంకోసం పోరాడాలని జిల్లా జేఏసీలకు ముఖ్యనేతలు సూచనలు చేశారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కన్వీ నర్లు, ముఖ్యులతో ఇటీవల జరిగిన సమా వేశంలో ఈ దిశలో పలు అంశాలపై చర్చించారు. జిల్లాల విభజనలో శాస్త్రీయత లేకపో వడంవల్ల అదనంగా కొన్ని సమస్యలు వస్తాయని, వాటితో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలపైనా అధ్యయనం చేయాలని జిల్లా నాయకులకు నిర్దేశించారు.
దీనికోసం రాష్ట్ర స్థాయి నుంచి సమన్వయం చేయడానికి బాధ్యులను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా సమస్యలు నెలకొన్నాయని, వాటిపై క్షేత్రస్థాయి నుంచి పోరాటాలను చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లాల విభజనతో క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం, నాయకత్వం, బాధ్యతల వంటి వాటి విషయంలో కొంత జాప్యం జరిగిన ట్టుగా జేఏసీ భావించింది. భూ నిర్వాసితుల సమస్యపై జేఏసీ చేస్తున్న పోరాటం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంతో పాటు ప్రతిపక్షాలను కూడా ఏకం చేయగలిగింది. ఈ నేపథ్యంలో కీలకమైన విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై తదుపరి కార్యాచరణకు జేఏసీ సిద్ధం అవుతోంది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఫీజు రీయింబర్సుమెంటు, యూని వర్సిటీలలో సిబ్బంది కొరత, హాస్టళ్లపై నిర్లక్ష్యం వంటి అంశాలపై ఇప్పటికే జేఏసీ సదస్సులను నిర్వహించింది.
వైద్య రంగంపై దృష్టి...
వైద్యరంగంలోనూ పేదలకు ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతు లు, సిబ్బంది లేకపోవడం వంటి సమస్యలపై ఇప్పటికే మానవహక్కుల సంఘానికి జేఏసీ ఫిర్యాదు చేసింది. ఖమ్మం, ఆదిలాబాద్ వంటి గిరిజన, ఆదివాసీప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను పెంచాలని, పరిశుభ్రత చర్యలను చేపట్టాలని, రోగ నిర్ధారణకు అవసరమైన పరికరాలను ఏర్పా టుచేయాలని జేఏసీ ఆందోళనలు నిర్వహిం చింది. రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులు పేదలను పీల్చుకు తింటున్నాయని, దీర్ఘకాలిక వ్యాధులతోపాటు అన్ని అత్యవసర చికిత్స లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేస్తే పేద ప్రజలకు ఇబ్బందులు తీరుతాయని జేఏసీ పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించింది.
మరో వైపు తెలంగాణరాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన నియామకాల డిమాండ్‌పైనా జేఏసీ దృష్టి సారించింది. వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకోసం యువతకు ఆర్థికసహాయం అందించాలని, రాష్ట్రంలో వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ వినతిపత్రాలను ఇచ్చింది. ఈ అంశాలపై కొత్త జిల్లాలను వేదికగా చేసుకుని పోరాటాలు చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకోవాలని నాయకత్వం సూచనలను చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు అట్టడుగు వర్గాలకు అందించేవిధంగా ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రణాళికలపై అధ్యయనం చేసి, నివేదికలను రూపొందించాలని జిల్లాల జేఏసీలకు సూచనలు అందించారు. సమగ్ర అధ్యయనం తర్వాత స్థానిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఆ తరువాత ప్రత్యక్ష కార్యాచరణకు ప్రజలను సిద్ధం చేయాలని నిర్ణయించారు.