
వ్యర్థాలకు కార్పొరేటర్ల ‘అర్థా’లే వేరులే
- చెత్త తరలింపు పేరిట దోపిడీ
- ప్రజాప్రతినిధుల దందా
- ప్రజాధనం దుర్వినియోగం
సాక్షి, సిటీబ్యూరో : వ్యర్థాలంటే గ్రేటర్ కార్పొరేటర్లకు ఎంతో మోజు! ఎందుకంటే వారికి ‘అర్థ’ బలం పెంపొందించేవి అవే మరి. చెత్త, నిర్మాణ వ్యర్థాల తరలింపు పేరిట బినామీ పేర్లతో లాభాలు సాధించే సాధనాలవి. అందుకే సమస్యల గురించి ఎవరెంత మొత్తుకుంటున్నా పట్టించుకోని కార్పొరేటర్లు.. పండగలొచ్చాయంటే చాలు.. వ్యర్థాల తరలింపు పనుల పేరిట అదనపు వాహనాలు.. అదనపు ట్రిప్పుల కోసం పట్టుబడుతుంటారు. పనులు మంజూరయ్యాక అద్దె వాహనాలతో తిప్పని ట్రిప్పుల్ని తిప్పినట్లు.. వినియోగించకుండానే కార్మికులను వినియోగించినట్లు రికార్డుల్లో చూపుతూ కాసులు సంపాదించుకుంటారు. ఇలా కార్పొరేటర్లు, వారికి సహకరించే అధికారులు కుమ్మక్కవుతూ జీహెచ్‌ఎంసీ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. ఈ తంతు జరుగుతున్న తీరు.. అవకతవకలు ఇలా ఉన్నాయి.
అవకతవకలిలా..
వర్క్ ఆర్డర్‌లో ఆరు టన్నుల టిప్పర్లుగా పేర్కొన చెత్త తరలింపు వాస్తవానికి రెండు టన్నులు కూడా ఉండవు.
రోజుకు ఐదు ట్రిప్పులు చేయాల్సి ఉండగా.. రెండు ట్రిప్పులే నడిపి ఐదింటికి బిల్లులు పొందుతారు.
ఒక్కో వాహనానికి నలుగురు కార్మికులనూ కాంట్రాక్టు ఏజెన్సీయే నియమించాలి. కానీ.. ఇద్దరిని లేదా ఒక్కరినే నియమిస్తుంది.
సాధారణ రోజుల్లోనూ ఇవే నిబంధనలున్నా.. పండుగల సందర్భాల్లో అందినకాడికి అన్నట్లుగా వారం నుంచి పది రోజుల వరకు అదనపు వాహనాలను అద్దెకు తీసుకుంటారు.
ఇలా అద్దెల పేరిట తీసుకునే వాహనాల్లో చాలా వరకు కార్పొరేటర్లకు చెందినవి (బినామీ పేర్లతోనూ) లేదా వారి మనుషులకు చెందినవి.. లేదా వారు సూచించిన ఏజెన్సీలవే ఉంటాయి.
సొంత వాహనాలున్న వారే అద్దెకివ్వాల్సి ఉండగా.. మరొకరి దగ్గర తక్కువ ధరకు అద్దెకు తీసుకొని.. వాటినే జీహెచ్‌ఎంసీకి అద్దెకిస్తున్న వారూ ఉన్నారు.
జీహెచ్‌ఎంసీ ఒక్కో వాహనానికి పది రోజులకు 50 ట్రిప్పులకు రూ.80,900 చెల్లిస్తుంది. ఇలా ఎన్ని వాహనాలైతే అంత మొత్తం చెల్లిస్తారు.
ఇంత జరిగినా అసలు లక్ష్యం నెరవేరుతుందా అంటే అదీ లేదు. రహదారుల్లోని వ్యర్థాలను నిర్దేశించిన క్వారీకి తరలించాల్సి ఉండగా అలా చేయరు.
ఒక చోట నుంచి వ్యర్థాలను సమీపంలోని మరో ప్రాంతానికి చేరుస్తారు. అవే వ్యర్థాలను అక్కడి నుంచి మరో చోటుకు తరలించే పేరిట మరోమారు బిల్లు పొందుతారు.
ఇలా ఓ చోట నుంచి వ్యర్థాలు మరో చోటుకు మారుతున్నాయే తప్ప సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు.
నిర్మాణ వ్యర్థాలు వెలువడేది ఎక్కువగా పాత భవనాలను కూల్చి కొత్తవి నిర్మించేటప్పుడే.
సదరు వ్యర్థాలను తరలించాల్సిన భవన యజమానుల వద్ద సొమ్ము వసూలు చేస్తూ జీహెచ్‌ఎంసీ వాహనాల ద్వారా తరలిస్తున్న ఘనులూ ఉన్నారు.
రహదారిపై నిర్మాణ వ్యర్థాలు వేసినందుకు ఒక యజమానికి ఆరేడునెలల క్రితం రూ.లక్ష జరిమానా విధించారు. అంతే అనంతరం చర్యలు నిల్.
నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే ఎంతో ప్రయోజనం. ఆ దిశగానూ చర్యలు లేవు.
చెప్పేదొకటి.. జరిగేదొకటి
వాహనాల ట్రిప్పుల సంఖ్యలో అక్రమాల నివారణకు జీపీఎస్ వినియోగిస్తున్నారు. దాని ద్వారా వాహనం ఎక్కడ తిరిగిందీ తెలుస్తుందే తప్ప.. డెబ్రిస్‌ను తరలించిందీ, లేనిదీ తెలియదు.
జీహెచ్‌ఎంసీ నిర్ణయించిన క్వారీల్లో డెబ్రిస్ వేయాల్సి ఉండగా, ఎక్కడ ఖాళీ జాగా కనపడితే అక్కడ వదిలేస్తున్నారు.
వ్యర్థాలు టిప్పర్లలోకి తరలించే ముందు.. అన్‌లోడ్ చేసేముందు ఓ ఎస్సార్టీ ద్వారా ఫొటోలు తీయలి. కానీ అమలవడం లేదు.
వ్యర్థాల బరువు తూయాల్సి ఉన్నప్పటికీ తూతూమంత్రంగా తప్ప అమలు జరగడం లేదు.
వ్యర్థాల తరలింపు పనులు జరిగినట్లు స్థానిక కార్పొరేటర్ల నుంచి ధ్రువపత్రం పొందాలి.
కార్పొరేటర్లకూ కావాల్సింది ఇదే. వాటాలు ముడితే పత్రాలు.. లేకుంటే కొర్రీలు.
దాదాపు 40 వాహనాలను ఇటీవల మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అద్దెకు తీసుకున్నారు.
- బహిరంగ టెండర్లను ఆహ్వానిస్తే.. తక్కువ ధరకే వాహనాలను అద్దెకిచ్చేవారున్నా, జీహెచ్‌ఎంసీలోని కాంట్రాక్టర్ల సిండికేట్‌కే వీటిని నామినేషన్‌పై అప్పగించారు.
- ఇందుకు దాదాపు రూ. 40 లక్షలు ఖర్చుచేశారు.
- ఇలా ఏటా కోట్ల రూపాయలు వ్యర్థాల పేరిట కాంట్రాక్టర్లకు కుమ్మరిస్తున్నారు.
ఏం చేయవచ్చు..
బహిరంగ ప్రదేశాల్లో డెబ్రిస్ వేసేవారిపై చర్యలు తీసుకుంటే చాలా వరకు రోడ్డపై వ్యర్థాలు తగ్గుతాయి.
డెబ్రిస్ తొలగింపు కోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు గతంలో ప్రకటించింది.
అవసరమైన వారు జీహెచ్‌ఎంసీకి ఫోన్ చేస్తే వాహనాన్ని పంపే ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
తద్వారా అవసరమైన వారికి సదుపాయంతోపాటు.. జీహెచ్‌ఎంసీకి డెబ్రిస్ తరలింపు వ్యయం తగ్గేది.