నీరు తెచ్చిన కష్టం
ట్యాంకర్ కోసం తల్లిదండ్రుల పరుగులు
భవనం పైనుంచి పడి చిన్నారికి
తీవ్ర గాయాలు కుత్బుల్లాపూర్‌లో ఇదీ దుస్థితి
కుత్బుల్లాపూర్: నీటి కష్టాలు నాలుగేళ్ల చిన్నారి పాలిట శాపంగా మారాయి. తల్లి మంచినీళ్ల కోసం ట్యాంకర్ వెంట పరుగులు పెడుతుండడాన్ని చూస్తూ రెండంతస్తుల పైనుంచి జారి పడి నాలుగేళ్ల చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రసూన నగర్‌కు బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో నీటి ట్యాంకర్ వచ్చింది. స్థానికంగా ఉండే దస్తగిరి, నాగలక్ష్మి దంపతులు బిందెలు తీసుకుని క్యూలో నిలుచున్నారు. నీళ్లు దొరక్కపోవడంతో తల్లి నాగలక్ష్మి ట్యాంకర్ల వెంట పరుగులు పెట్టారు. ఇదంతా రెండోఅంతస్తు నుంచి చూస్తున్న పెద్ద కుమార్తె నాగ సజన(4) ఒక్కసారిగా భవనంపై నుంచి జారి కింద పడింది. తీవ్ర గాయాలైన చిన్నారిని హుటాహుటిన చింతల్ హ్యాపీ చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఇదే కాలనీలో నీటి కోసం జరిగిన యుద్ధంలో ఓ మహిళ ముక్కుకు గాయమైంది. బుధవారం నాగేశ్వరరావు అనే వ్యక్తి వేలికి గాయమైంది. ఇలా అధికారులు నీటి కష్టాలు తెచ్చి పెట్టడంతో జనం అవస్థలు పడుతూ రహదారిపై నీళ్ల ట్యాంకర్ కనిపిస్తే చాలు దాని వెంట పరుగులు పెడుతున్నారు.
రెండో రోజూ కన్నీటి కష్టాలే..
కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో రెండోరోజైన బుధవారమూనీటి యుద్ధాలు కొనసాగాయి. వివిధ కాలనీల్లో జనం ట్యాంకర్ నీళ్ల కోసం క్యూ కట్టారు. సర్కిల్‌లోని 200 కాలనీల్లో సుమారు 5 లక్షల జనాభా ఉంది. మురికివాడలు అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో సుమారు 40 కాలనీలకు తాగునీటి పైపులైన్ వ్యవస్థ లేదు. 58 వేల నల్లా కనెక్షన్లకు గత మూడు రోజులుగా నీటి సరఫరా నిలిపివేయడంతో ఈ కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి సరఫరాకు కేవలం 36 ట్యాంకర్లను ఏర్పాటు చేయడంతో వీటి వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. వాటర్ ట్యాంకర్ల డ్రైవర్లు సైతం డ్రమ్ముకు రూ.40 చొప్పున వసూలు చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారుల నిఘా లోపం, బాధ్యతా రాహిత్యం వల్లనే తాగునీటి కష్టాల వచ్చాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.