Kutbullapur
-
ఒక్కడి కోసం ఐదుగురు
హైదరాబాద్: ఓ డిపార్ట్మెంట్ ఆఫీసర్..మరో చీఫ్ సూపరింటెండెంట్, ఒక ఇన్విజిలేటర్.. కాపలాగా హోంగార్డు.. తనిఖీ నిమిత్తం స్క్వాడ్.. ఇలా పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం ఆయా కేంద్రాల వద్ద విద్యాశాఖ నియమించిన అధికారులు. ఈ అధికారులంతా ఒకే ఒక విద్యార్థి కోసం విధులు నిర్వర్తించిన ఘటన కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. గురువారం జరిగిన సోషల్ పేపర్–1కు మొత్తం 11 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా సాయి సందీప్ అనే విద్యార్థి మాత్రమే పరీక్ష రాసేందుకు వచ్చాడు. ఈ ఒక్కడి కోసం వీరంతా తమ విధుల్ని నిర్వర్తించారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ప్రతినిధి స్కూల్‌కు చేరుకుని సాయి సందీప్‌ను పరీక్ష ఎలా రాశావని పలకరించగా అతడు నవ్వుతూ వెళ్లిపోయాడు. -
స్ట్రాంగ్‌రూంలను పరిశీలించిన కమిషనర్
గ్రేటర్ ఎన్నికలకు ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ 8 డివిజన్లలో జరిగే ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలను భద్ర పరిచే విషయంపై ఐడీపీఎల్ కాలనీ స్కూల్‌ను మంగళవారం సికింద్రాబాద్ నార్త్ జోన్ కమిషనర్ హరిచందన దాసరి పరిశీలించారు. మొత్తం నాలుగు స్ట్రాంగ్ రూంలతో పాటు 8 వార్డులకు ఒకటి చొప్పున కౌంటింగ్ హాల్‌లను గుర్తించారు. ఈఈ పర్యవేక్షణలో స్థానికంగా ఏర్పాట్లు జరగాలని ఆమె ఆదేశించారు. సర్కిల్ పరిధిలో మొత్తం 4,53,100 ఓటర్లు ఉండగా 429 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఉప కమిషనర్ గీత రాధిక తెలిపారు. -
‘మంత్రులకు నేను చెప్పిందే వేదం’
ఇదీ మోసగాడు రాకేష్‌రెడ్డి మాట తీరు కుత్బుల్లాపూర్: ‘‘మంత్రులకు నేను చెప్పిందే వేదం. ఏం చెప్తే అదే చేస్తారు.... ఎంపీలు... ఎమ్మెల్యేలు నాకు క్లోజ్.. హీరోయిన్సా.. వారి సంగతి నాకు వదిలేయ్’’.. అంటూ ఇతరులను ఇట్టే బుట్టలో వేసుకోవడం రాకేష్‌రెడ్డి నైజం.. టీడీపీ తెలుగు యువత నేతగా కుత్బుల్లాపూర్‌లో వెలుగు వెలిగిన రాకేష్‌రెడ్డి గురువారం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేడీగా మారిన విషయంపై ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇతను గత మూడేళ్లుగా టీడీపీలో తిరుగుతూ కీలక నేతల కుమారులతో స్నేహం చూస్తూ వారిని ఆకట్టుకునేలా వ్యవహరించేవాడని తెలిసింది. జల్సాలకు అలవాటుపడిన రాకేష్‌రెడ్డి క్రికెట్ బెట్టింగ్స్ కాసేవాడు. బుకీలకు ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లు చెప్పేవాడు. గెలిస్తే వెళ్లి డబ్బు తీసుకొనేవాడు.. ఓడితే మాత్రం బుకీలకు చుక్కలు చూపెట్టేవాడు. బూకీలు నిలదీస్తే మాజీ మంత్రుల కుమారుల పేర్లు చెప్పి తప్పించుకునే వాడు. మొదట స్నేహం.. ఆపై ద్రోహం రాకేష్‌రెడ్డి వ్యవహార శైలి మొదటి నుంచీ వివాదాస్పదమే. ఎవరి వద్దా పట్టుమని నమ్మకంగా పది రోజులు కూడా ఉండడు. వారి వద్దకు వచ్చే ప్రముఖల నుంచి ఫోన్ నెంబర్లు తీసుకుంటాడు. తర్వాత వారికి ఫోన్ చేసి బెదిరించి డబ్బు గుంజుతాడు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వద్ద కొన్ని రోజులు నమ్మకంగా ఉన్న రాకేష్‌రెడ్డి వ్యవహార శైలిని గుర్తించి వెంటనే అతన్ని పక్కకు తప్పించారు. అక్కడి నుంచి మకాం మార్చిన ఇతను నగరానికి చెందిన ఇద్దరు మాజీ హోం మంత్రుల కుమారులతో సన్నిహితంగా ఉంటూ వారిని కూడా ఇదే తరహాలో మోసం చేయడంతో వారు తరిమి కొట్టారు. చివరి ప్రయత్నంగా ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి డబ్బు వసూలు చేస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కాడు. అప్పులు చేసి గోవాలో ఎంజాయ్... రాకేష్‌రెడ్డి టీడీపీ తెలుగు యువత నాయకుడిగా తనకు తానే ప్రకటించుకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొనేవాడు. టీడీపీ నాయకుడిగా తనను నమ్మినవారి వద్ద సుమారు రూ. 2 కోట్లు వసూలు చేసిన రాకేశ్‌రెడ్డి వారికి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అప్పు తీసుకున్న డబ్బుతో గోవాలో జల్సాలు చేస్తున్నాడు. ఈనెల 3వ వారంలో రాకేష్‌రెడ్డిపై ఫిర్యాదులందగా పోలీసులు ఆరా తీయగా గోవాలో ఉన్నట్టు తెలిసింది. ఈనెల 16న నగరానికి వచ్చిన రాకేష్‌రెడ్డిని క్రైం పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పెద్ద ఎత్తున వ్యాపారులను, ఇతరులను బెదిరించి రూ. 12 లక్షలు వసూలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే అతను చెప్పిన దానికంటే ఎక్కువ మొత్తమే వసూలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏదేమైనా టీడీపీ నాయకులతో తిరుగుతూ జల్సాలు చేసిన రాకేష్‌రెడ్డి పోలీసులకు పట్టుబడటంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు. -
నీరు తెచ్చిన కష్టం
ట్యాంకర్ కోసం తల్లిదండ్రుల పరుగులు భవనం పైనుంచి పడి చిన్నారికి తీవ్ర గాయాలు కుత్బుల్లాపూర్‌లో ఇదీ దుస్థితి కుత్బుల్లాపూర్: నీటి కష్టాలు నాలుగేళ్ల చిన్నారి పాలిట శాపంగా మారాయి. తల్లి మంచినీళ్ల కోసం ట్యాంకర్ వెంట పరుగులు పెడుతుండడాన్ని చూస్తూ రెండంతస్తుల పైనుంచి జారి పడి నాలుగేళ్ల చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రసూన నగర్‌కు బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో నీటి ట్యాంకర్ వచ్చింది. స్థానికంగా ఉండే దస్తగిరి, నాగలక్ష్మి దంపతులు బిందెలు తీసుకుని క్యూలో నిలుచున్నారు. నీళ్లు దొరక్కపోవడంతో తల్లి నాగలక్ష్మి ట్యాంకర్ల వెంట పరుగులు పెట్టారు. ఇదంతా రెండోఅంతస్తు నుంచి చూస్తున్న పెద్ద కుమార్తె నాగ సజన(4) ఒక్కసారిగా భవనంపై నుంచి జారి కింద పడింది. తీవ్ర గాయాలైన చిన్నారిని హుటాహుటిన చింతల్ హ్యాపీ చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఇదే కాలనీలో నీటి కోసం జరిగిన యుద్ధంలో ఓ మహిళ ముక్కుకు గాయమైంది. బుధవారం నాగేశ్వరరావు అనే వ్యక్తి వేలికి గాయమైంది. ఇలా అధికారులు నీటి కష్టాలు తెచ్చి పెట్టడంతో జనం అవస్థలు పడుతూ రహదారిపై నీళ్ల ట్యాంకర్ కనిపిస్తే చాలు దాని వెంట పరుగులు పెడుతున్నారు. రెండో రోజూ కన్నీటి కష్టాలే.. కుత్బుల్లాపూర్ సర్కిల్లో రెండోరోజైన బుధవారమూనీటి యుద్ధాలు కొనసాగాయి. వివిధ కాలనీల్లో జనం ట్యాంకర్ నీళ్ల కోసం క్యూ కట్టారు. సర్కిల్లోని 200 కాలనీల్లో సుమారు 5 లక్షల జనాభా ఉంది. మురికివాడలు అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో సుమారు 40 కాలనీలకు తాగునీటి పైపులైన్ వ్యవస్థ లేదు. 58 వేల నల్లా కనెక్షన్లకు గత మూడు రోజులుగా నీటి సరఫరా నిలిపివేయడంతో ఈ కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి సరఫరాకు కేవలం 36 ట్యాంకర్లను ఏర్పాటు చేయడంతో వీటి వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. వాటర్ ట్యాంకర్ల డ్రైవర్లు సైతం డ్రమ్ముకు రూ.40 చొప్పున వసూలు చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారుల నిఘా లోపం, బాధ్యతా రాహిత్యం వల్లనే తాగునీటి కష్టాల వచ్చాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
చెట్టు నుంచి నీటి చుక్కలు..జనం మొక్కులు
కుత్బుల్లాపూర్: సుచిత్రా ప్రధాన రహదారిలోని విమానపూర్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలోని భారీ మేడిచెట్టు కొమ్మలన్నింటినీ యజమాని ఇటీవల నరికేశారు. అయితే, అక్కడక్కడా ఉన్న మోడుల నుంచి నీటి చుక్కలు పడుతుండడాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. అక్కడే చిన్నపాటి గుడి ఉండటంతో అదంతా దేవుడి మహిమేనని ఆనోటా.. ఈనోటా.. ఆ ప్రాంతంలో వ్యాపించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకోవటం మొదలైంది. జనం మొక్కులు, పూజలు ప్రారంభించటంతో అక్కడి రహదారిపై రాకపోకలు స్తంభించాయి. -
బైబై
‘భారతదేశం విజ్ఞాన సౌధం. ఈ దేశ పౌరులుగా గర్వపడాలి. సాధికారత ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం’.... ఈ మాటలు ఇంకా అక్కడి వారి చెవుల్లో మార్మోగుతున్నాయి. ఈ మాటలు పలికిన వ్యక్తి రూపం ఇంకా వారి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. నగరంలో చివరిసారిగా కుత్బుల్లాపూర్‌లోని బహదూర్‌పల్లిలో గల టెక్ మహీంద్ర ఎకోల్ సెంట్రల్ (ఎంఈసీ) కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో 2015 మే 14న నిర్వహించిన కార్యక్రమంలో అబ్దుల్ కలాం పాల్గొన్నారు. అక్కడి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. -
రంగుల డాన్...
మురిపించెన్.. ఓ ఊసరవెల్లి చెట్టుపై నుంచి కిందకు దిగి ఠీవీగా లాన్లో నడుచుకుంటూ వెళ్తోంది.. అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు, స్థానికులు దాన్ని చూశారు. చూడముచ్చటగా ఉండటంతో దాంతో కాసేపు ఆడుకున్నారు. ఫొటోలు తీసుకున్నారు. అనంతరం దాన్ని ఓ డబ్బాలో బంధించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్‌లోని కృష్ణకుంజ్ గార్డెన్లో చోటుచేసుకున్న ఈ దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి. ఫొటోలు: దశరధ్జ్రువా -
పట్టాల పంపిణీ
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన హామీ ప్రకారం నిరు పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాబూర్‌లోని మున్సిపల్ గ్రౌండ్లో గాజుల రామారం పట్టాదారులకు మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. -
కశ్మీర్ కొండల్లో నేలకొరిగిన తెలుగుతేజం
కశ్మీర్ కొండల్లో తెలుగు తేజంఆరిపోయింది. బందిపొరా జిల్లాలో బుధవారం సైన్యానికి చెందిన ధ్రువ్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నగరానికి చెందిన పైలట్ తాహీర్హుస్సేన్ఖాన్ దుర్మరణం చెందారు. దీంతో కుత్బుల్లాపూర్‌కు చెందిన సూరారంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుత్బుల్లాపూర్: ఆర్మీ పైలట్ అకాల మరణంతో రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ బిడ్డ ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాలివీ... సర్వర్ ఉస్సేన్ ఖాన్, అఫ్సర్ బేగంలకు మేజర్ హుస్సేన్ ఖాన్, తాహీర్ హుస్సేన్ ఖాన్, మహ్మద్ హుస్సేన్ ఖాన్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండోకుమారుడు తాహీర్ హుస్సేన్ ఖాన్(28) ప్రస్తుతం కశ్మీర్లో మేజర్ ర్యాంక్‌లో ఉంటూ ఆర్మీ పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా వీరు వెళ్లిన హెలికాప్టర్ బుధవారం రాత్రి 7 గంటలకు కూలిపోయినట్టు 7.45 గంటల ప్రాంతంలో ఆర్మీ సిబ్బందికి సమాచారం అందింది. సూరారంలో ఉంటున్న తండ్రి సర్వర్ హుస్సేన్‌కు అదే రోజు రాత్రి వారు విషయాన్ని చెప్పారు. తాహీర్ అకాల మరణ వార్త విన్న కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. 2002-03లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరిన తాహీర్ హుస్సేన్ 2010లో ఆర్మీలో చేరారు. దేశ సేవకే అంకితం సర్వర్ హుస్సేన్ ఖాన్ రాజస్థాన్ కోటాబందిలో ఆర్మీలో సిపాయిగా పని చేస్తున్న సమయంలో చేతికి దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఆర్మీ అధికారులు 2002లో అతనికి రిటైర్మెంట్ ప్రకటించి... రామగుండం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశం కల్పించారు. భార్య అఫ్సర్ బేగంతో కలసి బిడ్డలను ఉన్నత చదువులు చదివించారు. ఆర్మీపై మక్కువతో సర్వర్ తన బిడ్డలనూ అదే దిశగా నడిపించాడు. మొదటి కుమారుడు మేజర్ హుస్సేన్ ఖాన్ ప్రస్తుతం గ్వాలియర్‌లో ఆర్మీ అడ్మినిస్ట్రేటర్ గా పని చేస్తుండగా...రెండో కుమారుడు తాహీర్ హుస్సేన్ ఖాన్(28) కశ్మీర్లో పెలైట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మూడో కుమారుడు మహ్మద్ హుస్సేన్ ఖాన్ బోయిన్పల్లి ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పని చేస్తున్నారు. సర్వర్ హుస్సేన్ అన్నదమ్ముల కుమారులు సైతం ఎయిర్‌ఫోర్స్, ఆర్మీలోని వివిధ విభాగాల్లో పని చేస్తుండడం విశేషం. పెళ్లయి ఏడాది తిరగకుండానే... తాహీర్ హుస్సేన్ ఖాన్‌కు 2014 మే 30న నసీమ్సుల్తానాతో వివాహమైంది. ఇంతలోనే హెలికాప్టర్ ప్రమాద రూపంలో మృత్యువు అతన్ని బలిగొందనే వార్తను ఈ ప్రాంతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.