‘మంత్రులకు నేను చెప్పిందే వేదం’
- ఇదీ మోసగాడు రాకేష్‌రెడ్డి మాట తీరు
కుత్బుల్లాపూర్: ‘‘మంత్రులకు నేను చెప్పిందే వేదం. ఏం చెప్తే అదే చేస్తారు.... ఎంపీలు... ఎమ్మెల్యేలు నాకు క్లోజ్.. హీరోయిన్సా.. వారి సంగతి నాకు వదిలేయ్’’.. అంటూ ఇతరులను ఇట్టే బుట్టలో వేసుకోవడం రాకేష్‌రెడ్డి నైజం.. టీడీపీ తెలుగు యువత నేతగా కుత్బుల్లాపూర్‌లో వెలుగు వెలిగిన రాకేష్‌రెడ్డి గురువారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేడీగా మారిన విషయంపై ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇతను గత మూడేళ్లుగా టీడీపీలో తిరుగుతూ కీలక నేతల కుమారులతో స్నేహం చూస్తూ వారిని ఆకట్టుకునేలా వ్యవహరించేవాడని తెలిసింది. జల్సాలకు అలవాటుపడిన రాకేష్‌రెడ్డి క్రికెట్ బెట్టింగ్స్ కాసేవాడు. బుకీలకు ఫోన్‌ల ద్వారా బెట్టింగ్‌లు చెప్పేవాడు. గెలిస్తే వెళ్లి డబ్బు తీసుకొనేవాడు.. ఓడితే మాత్రం బుకీలకు చుక్కలు చూపెట్టేవాడు. బూకీలు నిలదీస్తే మాజీ మంత్రుల కుమారుల పేర్లు చెప్పి తప్పించుకునే వాడు.
మొదట స్నేహం.. ఆపై ద్రోహం
రాకేష్‌రెడ్డి వ్యవహార శైలి మొదటి నుంచీ వివాదాస్పదమే. ఎవరి వద్దా పట్టుమని నమ్మకంగా పది రోజులు కూడా ఉండడు. వారి వద్దకు వచ్చే ప్రముఖల నుంచి ఫోన్ నెంబర్లు తీసుకుంటాడు. తర్వాత వారికి ఫోన్ చేసి బెదిరించి డబ్బు గుంజుతాడు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వద్ద కొన్ని రోజులు నమ్మకంగా ఉన్న రాకేష్‌రెడ్డి వ్యవహార శైలిని గుర్తించి వెంటనే అతన్ని పక్కకు తప్పించారు. అక్కడి నుంచి మకాం మార్చిన ఇతను నగరానికి చెందిన ఇద్దరు మాజీ హోం మంత్రుల కుమారులతో సన్నిహితంగా ఉంటూ వారిని కూడా ఇదే తరహాలో మోసం చేయడంతో వారు తరిమి కొట్టారు. చివరి ప్రయత్నంగా ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి డబ్బు వసూలు చేస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కాడు.
అప్పులు చేసి గోవాలో ఎంజాయ్...
రాకేష్‌రెడ్డి టీడీపీ తెలుగు యువత నాయకుడిగా తనకు తానే ప్రకటించుకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొనేవాడు. టీడీపీ నాయకుడిగా తనను నమ్మినవారి వద్ద సుమారు రూ. 2 కోట్లు వసూలు చేసిన రాకేశ్‌రెడ్డి వారికి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అప్పు తీసుకున్న డబ్బుతో గోవాలో జల్సాలు చేస్తున్నాడు. ఈనెల 3వ వారంలో రాకేష్‌రెడ్డిపై ఫిర్యాదులందగా పోలీసులు ఆరా తీయగా గోవాలో ఉన్నట్టు తెలిసింది. ఈనెల 16న నగరానికి వచ్చిన రాకేష్‌రెడ్డిని క్రైం పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పెద్ద ఎత్తున వ్యాపారులను, ఇతరులను బెదిరించి రూ. 12 లక్షలు వసూలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే అతను చెప్పిన దానికంటే ఎక్కువ మొత్తమే వసూలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏదేమైనా టీడీపీ నాయకులతో తిరుగుతూ జల్సాలు చేసిన రాకేష్‌రెడ్డి పోలీసులకు పట్టుబడటంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు.