నిన్న హీరో.. నేడు కేడీ
ఎమ్మెల్యేల పేర్లు చెప్పి వసూళ్లు
ఇద్దరి అరెస్టు
భాగ్యనగర్ కాలనీ: ఎమ్మెల్యేల పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లు ఏకంగా ఓ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు నుంచే డబ్బు వసూలుకు యత్నించి దొరికిపోయారు. గురువారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ భుజంగరావు తెలిపిన వివరాల ప్రకారం... షాపూర్‌నగర్‌కు చెందిన కవకుట్ల రాకేష్‌రెడ్డి (28) వ్యాపారి. ఇతను చింతల్‌కు చెందిన చౌడవరం మహేష్‌కుమార్ (38)తో కలిసి ప్రజాప్రతినిధుల పేర్లను వాడుకొని సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. ఆరు నెలలుగా వీరిద్దరూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల పేర్లు చెప్పి పార్టీ ఫండ్ అంటూ ఆరు పరిశ్రమలు, షాపింగ్ మాల్స్‌తో పాటు వస్త్ర దుకాణాల్లో రూ. 12.55 లక్షలు వసూలు చేశారు. అయితే వీరు ఈనెల 22న భాగ్యనగర్‌కాలనీలోని గ్రీన్ బవార్చీ హోటల్ యజమాని భాస్కర్‌రావుకు ఫోన్ చేసి ఎమ్మెల్యే మనుషులమని, పార్టీ ఫండ్ కింద రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా మరుసటి రోజు కేపీహెచ్‌బీలోని కళానికేతన్ యజమానికి ఫోన్ చేసి రూ. 50 వేలు డిమాండ్ చేశారు.
ఇలా వెలుగులోకి...
గ్రీన్ బవార్చీ హోటల్ యజమాని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సొంత అన్న కొడుకు కావడంతో అక్రమ దందా విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. ఆయన సూచన మేరకు హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఫోన్ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తాము ఎవరెవరి వద్ద డబ్బు డిమాండ్ చేశామో నిందితులు వెల్లడించారు. వారి వద్ద నుంచి పోలీసులు రూ. 1.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో కూకట్‌పల్లి సీఐ పురుషోత్తం, అడిషనల్ సీఐ సురేందర్‌గౌడ్, ఎస్‌ఐ క్రాంతికుమార్ పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్: పోలీసులకు చిక్కిన రాకేష్‌రెడ్డి ఆది నుంచి వివాదాస్పదుడిగానే ముద్ర పడ్డా డు. అందరి దృష్టిలో పడేందుకు టీడీపీ నేత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుత్బుల్లాపూర్‌లో హల్‌చల్ చేస్తుండేవాడు. ఎవరు కలిసినా ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల పేర్లు, సినీ హీరోలు, హీరోయిన్‌ల పేర్లు చెప్పి తనకు క్లోజ్ అన్నట్లుగా నమ్మించేవాడు. కొన్ని సందర్భాల్లో అక్కడికక్కడే వారిలో ఫోన్‌లో మాట్లాడి ఆకట్టుకునేవాడు. ఇలా అందరి దృష్టిలో ‘ హీరో’ గా ఉన్న రాకేష్‌రెడ్డి ఒక్కసారిగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నిందితుడిగా ప్రత్యక్షం కావడం చర్చానీయాంశంగా మారింది. చాలా రోజులుగా కని పించకుండా రాకేష్‌రెడ్డి కేవలం రాత్రిపూటనే తన నివాసానికి వచ్చి వెళ్తుండేవాడని తెలిసింది.
ఇటీవలే టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, దేవేందర్‌గౌడ్ తనయుడు తూళ్లు వీరేందర్‌గౌడ్‌ల పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ దర్శనమిచ్చాడు. నమ్మిన వారిని నట్టేట ముంచి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడమే హాబీగా మార్చుకున్నాడు. ఎప్పుడూ బిజీ బిజీగా ఉన్నట్లుగా స్థానికులకు బిల్డప్ ఇస్తూ లక్షల్లో డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారిని ఇంటి చుట్టూ తిప్పించుకుని చుక్కలు చూపిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా వీఐపీలు, వీవీఐపీలతో ఫొటోలు దిగి వాటిని వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రచారం చేసుకునేవాడు. ఎవరైనా ఫోన్ చేస్తే ఫలానా ముఖ్యనేత.. వద్ద ఉన్నానంటూ నటించేవాడు. చింతల్ ప్రాంతానికి చెందిన మహేశ్‌తో కలిసి బెదిరింపులకు పాల్పడుతుండగా పోలీసులకు చిక్కారు.