కోటి ఎకరాలకు నీరు
♦ రైతు ఆత్మహత్యల నివారణపై హైకోర్టుకు నివేదించనున్న రాష్ట్ర సర్కారు
♦ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1.30 లక్షల కోట్లు వెచ్చిస్తాం
♦ 34 ప్రాజెక్టులకుగాను ఇప్పటికే 2 భారీ, ఒక మధ్య తరహా ప్రాజెక్టు పూర్తి చేశాం
♦ మరో 14 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయి
♦ కొత్తగా 13.92లక్షల ఎకరాలకు నీరందిస్తాం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించనుంది. ఇందుకు రూ.1.30 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు వివరించనుంది. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా, రైతులకు సాగునీటిపై భరోసా కల్పించేలా ప్రాజెక్టుల ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలపనుంది. రైతు ఆత్మహత్యల నివారణకు ఈ కార్యాచరణ అమలు చేస్తామని హైకోర్టుకు నివేదించనుంది. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. రైతులను ఆదుకునేందుకు తీసుకోబోయే చర్యలపై సమగ్ర వివరాలతో నివేదికను తమ ముందుంచాలని ఇటీవల న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నీటిపారుదల శాఖ పరిధిలో చేపడుతున్న పలు కార్యక్రమాలను కోర్టుకు నివేదించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
కొత్తగా సాగులోకి 13.92 లక్షల ఎకరాలు..
రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో 99.13 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని, కొత్తగా చేపడుతున్న పాలమూరు, డిండి ఎత్తిపోతల, పెనుగంగ ప్రాజెక్టులతో మరో 13.92 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా 1.13 కోట్ల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని, రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో దీనివాటా 67.5 శాతం ఉంటుందని వివరించింది. అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ.1.30 లక్షల కోట్ల మేర ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది. వీటితోపాటు మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని వివరించింది. గత ఏడాదిలో రూ.2,609 కోట్లతో 8,218 చెరువులు పునరుద్ధరించామని, ఈ ఏడాది రూ.3 వేల కోట్లతో 10,598 చెరువులను బాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. నీటి పారుదల శాఖ పరిధిలో తీసుకున్న ఈ చర్యల వల్ల రైతులకు సాగునీటి లభ్యత పెరుగుతుందని, భూగర్భ జలాల వృద్ధి జరుగుతుందని తెలిపింది. వ్యవసాయాన్ని విస్తరించడమేగాకుండా దాని అనుబంధ రంగాలకు ఊతమిచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు వివరించింది.
ఇప్పటికే రూ.45 వేల కోట్ల ఖర్చు
రాష్ట్రంలో 2004-05 నాటికి కొత్త ప్రాజెక్టులు చేపట్టక ముందే 47.20 లక్షల ఎకరాల భూమి సాగులో ఉందని, ఆ తర్వాత చేపట్టిన ప్రాజెక్టులతో కొత్తగా 8.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు హైకోర్టుకు సమర్పించనున్న నివేదికలో ప్రభుత్వం పే ర్కొంది. 2004-05 నుంచి పదేళ్ల కాలంలో ప్రాజెక్టు కింద రూ.45,909 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. మొత్తం 34 ప్రాజెక్టులకుగాను ఇప్పటికే 2 భారీ, ఒక మధ్య తరహా ప్రాజెక్టును పూర్తి చేశామని, మరో 14 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసినట్లు పేర్కొంది. ఏఐబీపీ కింద కేంద్రం 13 ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ.3,309.71 కోట్ల సాయం అందించిందని, మరో రూ.502.55 కోట్లు రావాల్సి ఉందని తెలిపింది.