హైదరాబాద్: రైతు ఆత్మహత్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మండి పడింది. తెలుగురాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వివరణకు పిటీషనర్లు సంతృప్తిగా లేరని, గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, పాలసీలు అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపిన సమాధానానికి కోర్టు సంతృప్తి చెందలేదు.
రైతు ఆత్మహత్యల నివారణకు గత నెల 30న ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో రైతు సంఘాలతో సమావేశం నిర్వహించామని, స్టేట్ లెవల్ అగ్రికల్చర్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే రైతు ఆత్మహత్యల నివారణకు పూర్తిస్థాయి చర్యలు తసుకోవాలని, ఆరు వారాల్లో ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఇరు రాష్ట్రాలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.