రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి వీడాలి
సాక్షి, హైదరాబాద్: రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని తెలంగాణ రైతు జేఏసీ డిమాండ్ చేసింది. రైతులకు ఆదాయ భద్రత, ఆత్మ గౌరవంతో కూడిన జీవితం కల్పించకుండా వ్యవసాయాన్ని కాపాడలేమని స్పష్టంచేసింది. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో వ్యవసాయశాఖ బుధవారం రైతు నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. వారి వాదనలను నాలుగు గంటలకు పైగా సేకరించింది.
ఈ సమావే శానికి ప్రభుత్వం తరపున వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి, కమిషనర్ జి.డి.ప్రియదర్శిని, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా తదితరులు హాజరయ్యారు. రైతు జేఏసీ తరఫున తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ, రామయ్య యాదవ్, డి.నర్సింహారెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్‌రావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదండరాం సహా పలువురు రైతు నేతలు తమ సలహాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రైతుల సంక్షేమానికి రాష్ట్రస్థాయిలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సకాలంలో రుణాలివ్వాలన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నివారించి లాభసాటి ధరకు రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ఏపీ అధికారులు రాకపోవడం గమనార్హం. కాగా, అధికారులతో తెలంగాణ రైతు జేఏసీ జరిపిన చర్చలకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరుకాకపోవడం బాధాకరమని కోదండరాం చెప్పారు. రైతులు తీవ్ర సమస్యల్లో ఉన్నారని, మంత్రి వస్తే బాగుండేదన్నారు.
రైతు నేతల డిమాండ్లు ఇవీ...
► రైతు ఆత్మహత్యలను గుర్తించే విధానం సులభతరం చేసేలా మార్గదర్శకాలను రూపొందించాలి. బాధిత కుటుంబాలకు సహాయ చర్యలు, ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు కచ్చితమైన కాలపరిమితి విధిస్తూ 421, 173 జీవోలను సవరించాలి.
► వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కేటాయింపులు పెంచాలి. సన్న, చిన్న, మధ్య తరగతి రైతులకు పనిముట్లపై సబ్సిడీ ఇవ్వాలి. ఉన్న సబ్సిడీని పెంచాలి.
► రైతులకు రూ. 3 వేల పింఛన్ ఇవ్వాలి.
► ప్రతీ గ్రామానికి విస్తరణాధికారి అందుబాటులో ఉండాలి. మెట్ట ప్రాంతాలకు అనువైన సాగు పద్ధతులను ప్రోత్సహించాలి.
► కంది, పెసర, జొన్న, సజ్జ, రాగులు, నూనెగింజల వంటి పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలి. వాటిని ప్రభుత్వమే సేకరించాలి.
► బీమా నియమాలను సమూలంగా మార్చాలి. బ్యాంకు రుణాల నుంచి ఈ బీమా పథకాలను వేరు చేయాలి. రైతు యూనిట్‌గా బీమా అమలుచేయాలి.
► బీమాను అన్ని పంటలకు విస్తరించాలి. చిన్న, సన్నకారు రైతుల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలి.
► కౌలు రైతులతోపాటు సాగుదారులందరికీ రుణ సౌకర్యం హక్కుగా కల్పించాలి.
► కార్పొరేట్ రుణ షెడ్యూలింగ్ విధానం తరహా పద్ధతి వ్యవసాయానికి తేవాలి.
► మిగిలిన రుణమాఫీని పూర్తిగా ఒకే దఫా చెల్లించాలి. కొత్త రుణాలు ఇవ్వాలి.
► అన్ని పంటలకు లాభసాటి ధరలను కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. అందుకు కర్ణాటక తరహాలో ఆదాయ భద్రత, ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేయాలి.
► రాష్ట్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలి. పథకాల అమలుపై సోషల్ ఆడిట్ పెట్టాలి.
► కరువు మాన్యువల్‌లో సమగ్ర మార్పులు చేయాలి. ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం ఎకరాకు రూ. 10 వేలు చెల్లించాలి.
►ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. కరువు ప్రాంతాల్లో ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచాలి.
► భూమి పరిమాణంతో సంబంధం లేకుండా రైతు కుటుంబాల ఆదాయాన్ని బట్టి సంక్షేమ పథకాలు అమలుచేయాలి.