రైతు రుణాలను ఏకమొత్తంగా మాఫీ చేయాలి
హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీవో69 ప్రకారం రూ.లక్ష వరకు రైతులు తీసుకున్న పంట, బంగారు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఏకమొత్తంగా మాఫీ చేసేలా ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దొంతిరెడ్డి నర్సింహారెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు ముదిరెడ్డి కోదండరెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శిని ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తా త్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఏకమొత్తంగా రుణమాఫీ చేయకపోవడం వల్ల కూడా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని పిటిషనర్లు ఆరోపించారు. రాష్ట్రంలో 2014 మార్చి 31 నాటికి రైతులు వడ్డీతో సహా చెల్లించాల్సిన రుణాన్ని లేదా రుణం తీసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేసేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తూ ప్రభుత్వం జీవో69 జారీ చేసిం దన్నారు. బ్యాంకుల నుంచి రుణా ల వివరాలను సేకరించిన వ్యవసాయశాఖ అధికారులు మొత్తం 36 లక్షల ఖాతాల ద్వారా రూ.17 వేల కోట్ల వరకు రైతులు రుణం తీసుకున్నట్లు తేలిందన్నారు.
రైతుల రుణాలను నాలుగు వాయిదాల్లో మాఫీ చేయడంతోపాటు బ్యాంకుల నుంచి మళ్లీ రుణాలు ఇప్పిస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిందని... కానీ బ్యాంకులు మాత్రం ప్రస్తుతం రుణాలు ఇవ్వట్లేదన్నారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.3-రూ.10 వరకు వడ్డీకి అప్పులు తెచ్చుకొని సాగు చేసినా కరువు పరిస్థితుల వల్ల పంట దిగుబడి తగ్గడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. 2014 జూన్ నుంచి 2015 మే వరకు 954 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.