
అందరికీ విప్ జారీ చేశాం.. పాటించాలి
అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసినట్లు వైఎస్‌ఆర్‌సీపీ విప్ ఎన్. అమర్‌నాథ రెడ్డి చెప్పారు. సోమవారం నాడు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. సాధారణంగా అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టినరోజే దానిపై చర్చ చేపట్టడం జరగదు. అయినా, అధికార పక్షం మాత్రం తమ విచక్షణాధికారంతో సోమవారమే దీనిపై చర్చ చేపట్టాలని నిర్ణయించింది. దాంతో, అందరికీ విప్ జారీ చేశామని అమర్‌నాథ రెడ్డి చెప్పారు.
తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు చేశామని, అది కాక ఇంకా ఈమెయిల్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్ లాంటి అన్ని మార్గాలలోను విప్ జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ చర్చలో పాల్గొనాలని, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని అందులో తెలిపామన్నారు. విప్ జారీచేసిన దానికి అనుకూలంగా సభ్యులు ఉండాలని తెలిపామని, దానికి ఎవరైనా విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.