తెలంగాణ సంస్కృతిని కాపాడుకుందాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కతిని కాపాడుకునేందుకు కృషి చేయాలని పలువురు తెలంగాణవాదులు కోరారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ‘బతుకమ్మ’ వ్యాస సంకలనాన్ని జాగృతి వ్యవస్థాపకురాలు కె.కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ అల్లం నారాయణ, సంపాదకుడు కె.శ్రీనివాస్, కవి నందిని సిధారెడ్డి, క ళాకారుడు దేశ్‌పతి శ్రీనివాస్, రచయిత గటిక విజయ్‌కుమార్, తెలంగాణ జాగృతి యువత అధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్ తదితరులు ప్రసంగించారు. బతుకమ్మ తెల ంగాణ సంస్కృతిలో భాగమే కాకుండా ఈ ప్రాంత ప్రజలు సంబంధాలను కలిపే వేదికని అన్నారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణ సంస్కృతిని దెబ్బతీశారని, పలు మీడియా సంస్థలు సైతం అందుకు ఆజ్యం పోశాయని ఆరోపించారు.
బంగారు బతుకమ్మ పేరుతో తెలంగాణ జాగృతి చేపట్టబోయే కార్యక్రమ వివరాలను ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. శుక్రవారం నుంచి జిల్లాల వారీగా బంగారు బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించి ఈనెల 12న ట్యాంక్‌బండ్ వద్ద పెద్ద ఎత్తున మహిళలంతా బతుకమ్మ ఆడనున్నట్లు చెప్పారు. కాళోజీ నారాయణరావు మొదలుకొని నేటితరం రచయిత నందిని సిధారెడ్డి వరకు బతుకమ్మ పండుగపై రాసిన కవితలను సంకలనం రూపంలో ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. బతుకమ్మ పండగ ఉద్యమ సంకేతంగా మారిందని, మర్చిపోతున్న పండుగను తెలంగాణ ఉద్యమం నిలబెట్టిందని అల్లం నారాయణ అన్నారు. డిగ్రీ కూడా చదవని ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడటం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. కె.శ్రీనివాస్ మాట్లాడుతూ...అస్తిత్వానికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ పండుగను కాపాడుకునేందుకు తెలంగాణలోని చెరువులు సంరక్షించుకోవడం ముఖ్యమన్నారు.