సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచం నలుమూలలా పూల జాతర అనే నినాదంతో ప్రతీ ఏటా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాలను ఈ నెల 28 నుంచి అక్టోబర్ ఆరో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘బతుకమ్మ సంబురాలు’పోస్టర్‌ను కవిత ఆవిష్కరించారు. క్షేత్ర స్థాయిలో బతుకమ్మ సంబురాలతో పాటు ఈ ఏడాది 300 మంది కవయిత్రులతో ‘మహాకవి సమ్మేళనం’నిర్వహణతో పాటు, ఆర్ట్ వర్క్‌షాపు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు తెలంగాణ జాగృతి ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్, ముంబైతో పాటు పలు దేశాల్లో తెలంగాణ జాగృతి శాఖలు బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తాయని కవిత వెల్లడించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే, కువైట్ తదితర దేశాల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి సన్నాహాలు చేస్తోంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు డాక్టర్ ప్రీతిరెడ్డి, మంచాల వరలక్ష్మి, నవీన్ ఆచారి, రాజీవ్ సాగర్, కొరబోయిన విజయ్, విక్రాంత్‌రెడ్డితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment