'పవన్ కల్యాణ్కు కాంగ్రెస్ మద్దతు'
సాక్షి, హైదరాబాద్: సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావలనుకుంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఊహించని విధంగా మద్దతు లభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధపడితే జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం వెల్లడించారు. ఇందిర భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన గంగాధరం.. పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నదని, అయితే పవన్ మొదట రాష్ట్రమంతా పర్యటించి పరిస్థితులపై అవగాహన కల్పించుకోవాలని అన్నారు.
'పవన్ రాష్ట్రంలో పర్యటించి సమస్యలను అవగాహన చేసుకోవాలి, వెంటనే వాటిపై స్పందించాలి' అని మాదాసు పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టిన ఏపీసీసీ డిప్యూటీ చీఫ్ సీపీఐ విధానం సరికాదన్నారు. విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం వంటిముఖ్యమైన అంశాలపై పవన్ కళ్యాణ్ పెదవి విప్పాలని కోరారు. సరైన సమయంలో రాష్ట్ర విభజన చేయలేకపోయామని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం భావిస్తున్నట్లు మాదాసు పేర్కొన్నారు.