madasu gangadharam
-
జనసేనకు ఝలక్.. వైఎస్సార్సీపీలో చేరిన మాదాసు గంగాధరం
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): ‘చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకూలంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇది నిజం కాదని ఒక్కమాట చెబితే ప్రకటన ఇద్దామని తాను గతంలో పవన్‌కు ఎన్నిసార్లు సూచించినా కనీసం పట్టించుకోలేదు.’ అని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మాజీ చైర్మన్ గంగాధరం అన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో మాదాసు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును పట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప, తనకు తానుగా ఏమి చేసుకోలేరని విమర్శించారు. ఆయన్ను నమ్ముకుని కొంతమంది ఉద్యోగాలను కూడా వదులుకుని బయటకు వచ్చారన్నారు. కానీ వారిని నట్టేట ముంచాడన్నారు. నాదెండ్ల మనోహర్ కూడా పవన్‌ను తప్పదోవ పట్టించేలా మాట్లాడుతూ బాస్‌కు జనం వస్తున్నారులే, గ్రామస్థాయిలో అవసరం లేదనే విధంగా చెప్పుకొచ్చేవారని గుర్తుచేశారు. పార్టీని బలోపేతం చేద్దామని గతంలో పవన్‌కు సూచించినా కనీసం పట్టించుకోలేదన్నారు. కొంతమంది రాసిన వాటిని పట్టుకుని ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తూ బురదజల్లే ప్రయత్నాలు పవన్ చేయడం తనకు నచ్చలేదన్నారు. అందుకే కొద్దినెలలుగా జనసేనకి దూరంగా ఉంటున్నానని చెప్పారు. సీఎం ఆదేశాల ప్రకారం నడుచుకుంటా బాలినేని, పెద్దిరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గతంలోనే తనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారని మాదాసు తెలిపారు. ఇప్పటికే తన కుమారుడు మాదాసు పవన్ వైఎస్సార్సీపీలో ఉన్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు ఏ బాధ్యత అప్పగించినా, ఏ పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. చదవండి: (నారాయణ చరిత్ర: ట్యూషన్ మాస్టర్‌గా మొదలై..) -
జనసేనకు షాక్! మాదాసు గంగాధరం రాజీనామా
-
జనసేనకు షాక్! మాదాసు గంగాధరం రాజీనామా
సాక్షి, అమరావతి : మాజీ ఎమ్మెల్సీ, జనసేన పార్టీ సీనియర్ నేత మాదాసు గంగధరం ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖలో.. ‘‘ పవన్ నిర్ణయాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని పవన్ ఎప్పుడూ ఖండించలేదు. మౌనం అర్ధాంగీకారం అనే భావన అందరిలో నెలకొంది. వివేకా హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని విమర్శలు చేశారు. కేంద్రం పరిధిలో పనిచేసే సీబీఐ దర్యాప్తును ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది?. పవన్ పోటీ చేసిన గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు పవన్ అండగా నిలవలేకపోతున్నారు. సినిమా ప్రపంచం వేరు.. రాజకీయం ప్రపంచం వేరు. రెండింటికీ తేడా తెలియని మీతో పని చేయలేను. పార్టీ నిర్మాణంపై జనసేన దృష్టి పెట్టడం లేదు. ప్రజలు కోరుకున్నట్లు జనసేన పనిచేయడం లేద’’ని పేర్కొన్నారు. మాదాసు గంగాధరం జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం జనసేన ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. -
దేశాన్ని కాషాయీకరణ చేసేందుకు కుట్ర: పీసీసీ
మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని కాషాయీకరణ చేసేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని పీసీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం పేర్కొన్నారు. సోమవారం ఇందిర భవన్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మొదటి నుంచి లౌకిక వాదానికి కట్టుబడి ఉందన్నారు. కొన్ని స్వార్థశక్తులు తమ స్వలాభం కోసం కుట్రలు పన్నుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఆ నాడు దేశం కోసం పోరాడిన స్పూర్తితోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలు, ఏపీకి ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు జాతీయ స్థాయిలో అన్ని పార్టీల వారు మద్దతు తెలపడం సంతోషకరం అన్నారు. బడుగు, బలహీన వర్గాల గుండెల్లో కాంగ్రెస్ పార్టీకి సుస్థిర స్థానం ఉందని, ఎన్ని కష్టాలు ఎదురైనా మున్ముందు పటిష్టం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు, ప్రధాన కార్యదర్శులు జంగా గౌతం, గిడుగు రుద్రరాజు, ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, ఎన్.తులసిరెడ్డి, సూర్యానాయక్, కిసాన్ సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసమస్యలపై పోరాడితే పవన్‌కు మద్దతు
పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమైతే ‘జనసేన’ అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం అన్నారు. ఇందిర భవన్లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. క్రియాశీల రాజకీయాల్లో పవన్ కల్యాణ్ రావడాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తోందన్నారు. ఆయన మొదట రాష్ట్రమంతా పర్యటించి ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకొని వాటిపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. విభజన హామీలపై ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం తదితరఅంశాలపై పవన్ కల్యాణ్ పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. -
'పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్ మద్దతు'
సాక్షి, హైదరాబాద్: సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావలనుకుంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఊహించని విధంగా మద్దతు లభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధపడితే జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం వెల్లడించారు. ఇందిర భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన గంగాధరం.. పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నదని, అయితే పవన్ మొదట రాష్ట్రమంతా పర్యటించి పరిస్థితులపై అవగాహన కల్పించుకోవాలని అన్నారు. 'పవన్ రాష్ట్రంలో పర్యటించి సమస్యలను అవగాహన చేసుకోవాలి, వెంటనే వాటిపై స్పందించాలి' అని మాదాసు పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టిన ఏపీసీసీ డిప్యూటీ చీఫ్ సీపీఐ విధానం సరికాదన్నారు. విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం వంటిముఖ్యమైన అంశాలపై పవన్ కళ్యాణ్ పెదవి విప్పాలని కోరారు. సరైన సమయంలో రాష్ట్ర విభజన చేయలేకపోయామని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం భావిస్తున్నట్లు మాదాసు పేర్కొన్నారు. -
ఇందిరాభవన్ లో స్వాతంత్ర్య వేడుకలు
హైదరాబాద్ : నగరంలోని ఇందిరాభవన్‌లో 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ వేడుకలలో కేవీపీ రామచందర్ రావు పాల్గొన్నారు. -
పచ్చ చొక్కా ధరించి ‘సైకిల్’ ఎక్కు
హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పచ్చ చొక్కా ధరించి ‘సైకిల్’ ఎక్కాలని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం సూచించారు. సిద్ధాంతాల పేరుతో పార్టీ స్థాపించిన పవన్ నరేంద్రమోడీ-చంద్రబాబులకు మద్ధతు అంటూ రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. మాదాసు శుక్రవారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. బాబు-మోడీలతో పవన్ కల్యాణ్ ప్యాకేజీలు మాట్లాడుకుని ‘మీకు మేము.. మాకు మీరు’ అన్న రీతిలో వ్యవహరిస్తున్నట్టు ప్రజలకు అనుమానాలున్నాయన్నారు. ‘జనసేన’ ముసుగు తొలగించి నచ్చిన వారికి మద్దతిచ్చుకోవాలని హితవు పలికారు. పవన్‌కల్యాణ్ తెలంగాణలో ఒకలా, సీమాంధ్రలో మరోలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అన్నచాటు బిడ్డగా పెరిగిన పవన్ కల్యాణ్ ఇప్పుడు చిరంజీవి మద్ధతిస్తున్న కాంగ్రెస్ పార్టీపై, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన పాపం తల్లీ కొడుకులదేనంటూ సోనియా, రాహుల్‌పై రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలని పవన్‌కు సూచించారు. ఈనెల 3, 4వ తేదీల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సారధి చిరంజీవి శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తారని, 5వ తేదీన ఆత్మకూరు, మదనపల్లె ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని మాదాసు చెప్పారు. వైఎస్సార్ జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జిగా నజీర్ అహ్మద్ వైఎస్సార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అధ్యక్షుడిగా నజీర్ అహ్మద్‌ను నియమిస్తూ ఏపీ పీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆశోక్‌కుమార్ తప్పుకోవటంతో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న నజీర్ అహ్మద్‌ను ఈ ఎన్నికలు ముగిసేంత వరకూ బాధ్యతలు చేపట్టాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.