ప్రాజెక్టు పరిశీలనకోసం రాష్ట్రానికి వచ్చిన మహారాష్ట్ర మంత్రి లోనికర్
సాక్షి, హైదరాబాద్: తాగునీటి ఎద్దడి అధికంగా ఉండే తమ రాష్ట్రానికి మిషన్ భగీరథ తరహా ప్రాజెక్టు ఎంతో అవసరమని మహారాష్ట్ర తాగునీటి సరఫరా శాఖ మంత్రి బాబన్‌రావ్ లోనికర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టును పరిశీలించేందుకు ఆయన శనివారం రాష్ట్రానికి వచ్చారు. మంత్రితో పాటు వచ్చిన ఇంజనీర్ల బృందానికి మిషన్ భగీరథ ప్రాజె క్టు స్వరూపం, పనుల పురోగతిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తెలంగాణ భౌగోళిక స్వరూపం, నీటి ఎద్దడి ప్రాంతాలు.. తదితర అంశాలను వివరించారు. 90% నీటిని గ్రావిటీ ద్వారానే సరఫరా చేస్తున్నందున విద్యుత్ వినియోగం కూడా తక్కువగానే ఉంటుందన్నారు. భగీరథ ప్రాజెక్టు టెండర్లలో అనుసరించిన విధానాల కారణంగా ఆర్థిక పరిపుష్టి కలిగిన వర్క్ ఏజెన్సీలే పనులను చేస్తున్నాయని, నిర్వహణ బాధ్యతలను కూడా వాటికే అప్పగించినందున నాణ్యతలో రాజీపడే అవకాశం లేదని అన్నారు.
మంత్రి లోనికర్ మాట్లాడుతూ.. మూడేళ్లుగా మరట్వాడా ప్రాంతంలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉన్నందున, మిషన్ భగీరథ తరహా పథకాన్ని అమలు చేయాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన అనుమతులను కూడా తక్కువ సమయంలోనే పొందడం, మిషన్ భగీరథ ప్రాజెక్టును దేశానికి ఆదర్శంగా నిలపడంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల కృషి అభినందనీయమన్నారు. భగీరథ స్ఫూర్తితోనే త్వరలో తాము కూడా ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.