సాక్షి, ముంబై: బీజేపీ మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్ష బాధ్యతలను మరఠ్వాడా రీజియన్‌కు చెందిన నాయకుడికి అప్పగించనున్నారు. ఈ మేరకు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సుజిత్‌సింగ్ ఠాకూర్‌కు ఈ పదవిని కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్ష పదవిలో ఎవరిని నియమించాలో తెలియక నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ పదవి దక్కించుకునేందుకు అనేక మంది పైరవీలు కూడా చేశారు.
కాని ఒకరి కట్టబెడితే మరొక రు అసంతృప్తి చెందుతారని భావించి ‘ఒక వ్యక్తి- ఒక పదవి’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ ఠాకూర్ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ పదవికి ఠాకూర్‌తోపాటు ముంబై బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు ఆశీష్ శేలార్, సీనియర్ నాయకుడు రఘునాథ్ కులకర్ణి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. కాని సామాజిక, ప్రాదేశిక సమీకరణానుసారం ఠాకూర్ పేరు అగ్రస్థానంలో ఉంది. దీంతో ఆయనకే కట్టబెట్టాలనే నిర్ణయానికొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
గత 25 సంవత్సరాల నుంచి ఆయన పార్టీలో కొనసాగుతూ స్థానిక స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బీజేపీలో కీలక నాయకులందరితో సత్సంబంధాలు ఉన్నాయి. దివంగత గోపినాథ్ ముండేకు అత్యంత సన్నిహితుడనే పేరుంది. మైనార్టీ సమాజానికి చెందిన ఠాకూర్ ఉస్మానాబాద్ జిల్లా పరాండా గ్రామానికి చెందిన వారు. ఇదివరకు ఆయన భారతీయ జనతాపార్టీ యువ మోర్చకు ప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. ప్రదేశ్ కార్యవర్గంలో కార్యదర్శిగా, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఠాకూర్!
Published Fri, Nov 7 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement