అది అంత ఆషామాషీ నిర్ణయం కాదు: కేసీఆర్
హైదరాబాద్: గవర్నర్ వేరు, ప్రభుత్వం వేరుకాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విశ్వవిద్యాలయాల్లో గత అనుభవాలు బాధాకరంగా ఉన్నాయని చెప్పారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ చట్ట సవరణ బిల్లు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. గతంలో వీసీలు సాయంత్రం పదవి నుంచి దిగిపోతుండగా 300, 370 మందిని నియమించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాకతీయ, తెలంగాణ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల వీసీల తీరు బాధాకరంగా ఉందని సాయంత్రం దిగిపోయే ముందు భారీ ఎత్తున నియామకాలు జరిగాయని అన్నారు. ఫలితంగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వీసీల నియామకం ఆషామాషీగా తీసుకునే నిర్ణయం కాదని అన్నారు. ఈ నియామకాల్లో తమకు దురుద్దేశం ఏమీ లేదని వివరణ ఇచ్చారు.