పార్టీ బలోపేతంపై దృష్టి: పవన్ కల్యాణ్
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. 'ఇందులో భాగంగా బొంగునూరి మహేందర్ రెడ్డి, నేమూరి శంకర్ గౌడ్, పి.హరిప్రసాద్లకు కీలక బాధ్యతలు అప్పగించాము. పార్టీ ఆవిర్భావ సమయంలో ఉపాధ్యక్షునిగా నియమితులైన మహేందర్ రెడ్డి తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయ కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. నేమూరి శంకర్ గౌడ్ పార్టీ తెలంగాణ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. సీనియర్ పాత్రికేయుడు పి.హరిప్రసాద్ను పార్టీ మీడియా విభాగానికి హెడ్గా నియమించాము' అని ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు.
'రంగారెడ్డి జిల్లా డి.పోచంపల్లిలో జన్మించిన మహేందర్ రెడ్డి, బోరబండ నివాసి అయిన నేమూరి శంకర్ గౌడ్ వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. నేను స్థాపించిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సీఎంపీఎఫ్)లో చురుకైన కార్యకర్తలుగా పనిచేసిన వీరిద్దరూ రాజకీయ, సేవ కార్యక్రమాల్లో పయనిస్తున్నారు. గత పద్నాలుగేళ్లుగా వీరి అకుంఠిత దీక్ష, సేవా కార్యక్రమాల పట్ల అపేక్ష, రాజకీయాలపై గౌరవాన్ని చూసిన తర్వాత, జనసేన పార్టీకి బాధ్యతాయుతమైన క్రీయాశీలక నేతలుగా ఎంపిక చేశాము. పాత్రికేయుడిగా గత మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న పి.హరిప్రసాద్ అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి జనసేన పార్టీ మీడియా విభాగానికి హెడ్ గా నియమించాము' అని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.