ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటున్నారు. కానీ అది ఇన్‌సైడ్ ట్రేడింగ్ కాదు. విపక్ష నేత వై.ఎస్. జగన్ చెబుతున్నట్లుగా ఇన్‌సైడర్ ట్రేడింగ్.
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటున్నారు. కానీ అది ఇన్‌సైడ్ ట్రేడింగ్ కాదు. విపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా ఇన్‌సైడర్ ట్రేడింగ్. ఒక్కమాటలో చెప్పాలంటే రహస్య సమాచారం తెలిసిన లేదా తెలిసే అవకాశం ఉన్న ఇన్‌సైడర్ (లోపలి మనిషి).. దానిద్వారా లబ్ధి పొందటానికి జరిపే బహిరంగ లావాదేవీ. స్టాక్ మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే... షేర్ మార్కెట్లో లిస్టయిన ఏ సంస్థయినా దానికి సంబంధించిన కీలక ప్రకటనల్ని అందరికన్నా ముందు స్టాక్ మార్కెట్‌కు తెలపాలి. ఆ కీలక ప్రకటన వల్ల మార్కెట్లో ఆ సంస్థ షేరు ధర పెరగొచ్చు... లేదా తగ్గొచ్చు.
స్టాక్ మార్కెట్లకు తెలిపితే... అందుకు తగ్గట్టు మదుపరులు ఆ షేర్లు కొనటమో, అమ్మటమో చేస్తారు. కానీ మార్కెట్లకు చెప్పడానికన్నా ముందు... ఆ సమాచారాన్ని ఆధారం చేసుకుని సంస్థలోని కీలక వ్యక్తులు తమ సొంతంగానో, బంధుమిత్రుల ద్వారానో షేర్లను అమ్మటమో, కొనటమో చేసి లబ్ధి పొందితే... దాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌గా పరిగణిస్తారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దేశాల్లో నిషేధం ఉంది. ఇలా చేసినవారికి జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
ఈ రెండు ఉదాహరణలూ చూస్తే...
హైదరాబాద్‌లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ సహ వ్యవస్థాపకుడైన రజత్ గుప్తాకు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్ డెరైక్టర్‌గా ఉన్నప్పుడు గుప్తా కీలకమైన కంపెనీ సమాచారాన్ని అమెరికాలో హెడ్జ్ ఫండ్ మేనేజర్ రాజరత్నంకు అందించడం, ఇది కోర్టులో రుజువవటంతో ఇద్దరికీ శిక్షలు పడ్డాయి. 1997లో ఐఎస్‌బీని ఏర్పాటు చేసిన గుప్తా... అప్పటి సీఎం బాబుకు అత్యంత సన్నిహితుడు.
ఇక ప్రభుత్వం విషయానికొస్తే... కేబినెట్‌కు తెలిసిన రహస్య సమాచారాన్ని ఎవరు స్వలాభానికి ఉపయోగించుకున్నా, లబ్ధి పొందినా అధికార రహస్యాల చట్టం కింద అది నేరం. కేంద్ర కేబినెట్ తీసుకోనున్న నిర్ణయానికి సంబంధించి కొన్ని పత్రాల్ని చేజిక్కించుకున్న నేరానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారులు గతంలో జైలుకెళ్లారు.