‘ప్రభుత్వం ఏం చేస్తోంది? మంత్రిమౌనం ఎందుకు?’
Published Sat, Mar 4 2017 5:05 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: పోలీసుశాఖలో ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. వేధింపుల కారణంగానే దుబ్బాక ఎస్సై చిట్టి బాబు సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడన్నారు. గతంలో కూడా ఓ ఎస్సై సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడని తెలిపారు. ఇటువంటి ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ నియంత్రణ ఏమైందని ప్రశ్నించారు. పోలీస్ శాఖలో అవినీతి ఇంత మితిమీరి పోతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. హరీష్ సొంత జిల్లాలో పోలీసులు ఉన్నతాధికారుల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూంటే .. మంత్రిగా హరీష్ రావు ఏం చేస్తున్నారని నిలదీశారు.
ఎస్సై ఆత్మహత్యపై హోంమంత్రి ఎందుకు మౌనం దాల్చారన్నారు. ఈ ఆత్మహత్యలపై హోం మంత్రి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతోందని, కాంగ్రెస్‌ను ఉరి తీయాలని మంత్రి హరీష్ రావు మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి సోదరుల వ్యవహారంపై సమన్వయ కమిటీలో సీరియస్ గానే చర్చ జరిగిందని చెప్పారు. దీనిపై దిగ్విజయ్‌సింగ్ నేతలందరికి సరైన దిశానిర్దేశం చేశారని తెలిపారు. దిగ్విజయ్ సింగ్‌పై టీఆర్‌ఎస్ నేతల విమర్శలు చేయటం సరికాదన్నారు. వారికి ఆ అర్హత లేదన్నారు. జాతీయపార్టీలో ఉన్న తమ పార్టీ జాతీయనేతలు రాష్ట్రానికి రావడం సహజమని, ఆ మాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేస్తే ఎలాగని ప్రశ్నించారు.
Advertisement
Advertisement