ఇదెక్కడి నియామకం..?
♦ ఉత్తర్వులు లేకుండానే ఇన్‌చార్జి వీసీగా శైలజా రామయ్యర్ బాధ్యత స్వీకరణ
♦ జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో మరోసారి గందరగోళం
సాక్షి, హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)లో మరో వివా దానికి తెరలేచింది. ప్రస్తుత ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పద్మావతి స్థానంలో ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ ఇన్‌చార్జి వీసీ హోదాలో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ విషయంలో ఇన్‌చార్జి వీసీ పద్మావతి, స్పెషల్ సీఎస్ రాజీవ్ ఆర్.ఆచార్యకు మధ్య లేఖల యుద్ధం కొనసాగింది. పదవీకాలం ముగిసిన కవితా దర్యానీనే రిజిస్ట్రార్‌గా కొనగించాలని వీసీకి 2 సార్లు లేఖ రాయగా, మానిటరింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీనివాస్‌రెడ్డిని కొత్త ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా కొనసాగించాలని వీసీ పట్టుబట్టారు. ఈ ఘటనే తాజా పరిణామాలకు కారణమై ఉండవచ్చని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి.
ఉత్తర్వులు లేకుండానే..
సాధారణంగా ఏదైనా విశ్వవిద్యాలయానికి రెగ్యులర్ వీసీ, ఇన్‌చార్జి వీసీలను నియమించేందుకు ప్రభుత్వం తప్పనిసరిగా ఉత్తర్వులు జారీ చేస్తుంది. చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ ఆమోదంతోనే ఆయా ఉత్తర్వులు వెలువడతాయి. అయితే ఇందుకు భిన్నంగా తాజాగా జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో ఇన్‌చార్జి వీసీ నియామకం జరగడం వివాదానికి దారి తీసింది. శుక్రవారం ఉదయం సిబ్బందికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే శైలజా రామయ్యర్ నేరుగా వచ్చి వీసీ సీటులో కూర్చున్నట్టు తెలిసింది. వీసీ నియామకానికి సంబంధించి విద్యా శాఖ స్పెషల్ సీఎస్ ఇచ్చిన లేఖనే ఉత్తర్వులుగా ఆమె పేర్కొన్నట్లు వర్సిటీ సిబ్బంది చెపుతున్నారు.
అయితే స్పెషల్ సీఎస్ ఉత్తర్వులకు సంబంధించిన కాపీని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టడం, వర్సిటీకి ప్రత్యేకంగా ప్రతిని పంపకపోవడం గమనార్హం. ప్రభుత్వం వర్సిటికీ రెగ్యులర్ వీసీని నియమించేంత వరకు ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా ఉన్న పద్మావతినే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించినా, స్పెషల్ సీఎస్ కేవలం లేఖ ద్వారా ఆమెను తొలగించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని వర్సిటీ ఉద్యోగులు పేర్కొంటున్నారు.