
ఎర్రబెల్లి ఎక్కడ?
♦ గ్రేటర్ ఎన్నికలకు దూరంగా తెలంగాణ టీడీపీ నేత
♦ నిజాం కాలేజీ బహిరంగ సభలోనూ అంటీముట్టనట్టే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆ పార్టీలో పొమ్మనలేక పొగబెడుతున్నారా? పార్టీలో తాజా పరిణామాలను పరిశీలిస్తే ఇదే అనుమానం కలుగుతోంది. తెలంగాణలో పార్టీ మొత్తంగా ఉనికి కోల్పోతున్నా రాజధాని హైదరాబాద్‌లో తమకు ఎదురులేదని చెప్పేందుకు గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీటీడీపీ.. ఈ వ్యవహారంలో బీజేపీతో పొత్తు మొదలుకొని అభ్యర్థుల ఖరారు వరకు చం ద్రబాబు సూచనల మేరకు ఆయన కుమారుడు లోకేశ్ కనుసన్నల్లో సాగింది. ఈ ఎపిసోడ్‌లో పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అక్కడక్కడ కనిపించినా.. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు.
వీరితోపాటు బాబు సామాజిక వర్గానికి చెందిన హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ కూడా టికెట్ల కేటాయింపుల్లో కనిపించినా.. ఎర్రబెల్లి మాత్రం ఉనికిలో లేకుండా పోయారు. పార్టీ తెలంగాణ బాధ్యతలను చంద్రబాబు పూర్తిస్థాయిలో రేవంత్‌కి అప్పగించడం ఒకెత్తయితే.. సీఎం కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లిపట్ల ఆయన అపనమ్మకంతో వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తుండడంతో ఎన్నికల ప్రక్రియకు ఎర్రబెల్లి దూరంగానే ఉంటున్నారు. ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాలు, ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగే మీడియా సమావేశాలకు ఆయన హాజరు కావడం లేదు. అసెంబ్లీలోని ఫ్లోర్‌లీడర్ చాంబర్‌కూ దూరంగానే ఉంటున్నారు.
ఎన్నికలకు ముందు జర్నలిస్టు యూనియన్లు నిర్వహించే ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమాల్లోనూ ఎక్కడా కనిపించలేదు. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభ సమయంలో నిజాం కళాశాల మైదానంలో జరిగిన టీడీపీ-బీజేపీ సభకు హాజరైనప్పుడు ఎర్రబెల్లి ముభావంగానే కనిపిం చారు. సభలో ప్రసంగించాల్సిందిగా కోరితే ‘అందరికీ నమస్కారం’ అని చెప్పి కూర్చుండిపోయారు. బాబు ఉన్నంతసేపు ఆయనకు దూరంగా ఉండేందుకే ప్రయత్నించడం గమనార్హం. శుక్రవారం జరిగిన జీహెచ్‌ఎంసీ అభ్యర్థుల ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎర్రబెల్లి.. సాధారణ నాయకుల తరహాలో లోకేశ్‌ను కలసి దూరంగానే మెలగడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
రేవంత్‌రెడ్డికి ప్రోత్సాహం: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్‌ను ఎర్రబెల్లి ఒంటరిగా కలవడంతో ఆయన పార్టీ మారి మంత్రి అవుతారని జరిగిన ప్రచారం నాటి నుంచే ఎర్రబెల్లిని పార్టీలో ఒంటరిని చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన్ను టీఆర్‌ఎస్‌లోకి రాకుం డా వరంగల్ జిల్లా నేతలే అడ్డుకున్నారని, వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో చేర్చుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సొంత పార్టీలోనే వ్యతిరేక ప్రచారం మొదలైంది. అదే సమయంలో కేసీఆర్‌పై విమర్శలు గుప్పించేందుకే అన్నట్లుగా చంద్రబాబు రేవంత్‌రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. దాన్ని ఆసరాగా తీసుకున్న రేవంత్ ముఖ్యమంత్రి సామాజిక వర్గంపైనే నేరుగా ‘దొరలు’ పేరుతో ఘాటైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
మైహోమ్స్ అధినేత రామేశ్వర్‌రావుకు సంబంధించిన భూ వివాదంలో కూడా రేవంత్‌రెడ్డి ‘దొరల’పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో ఎర్రబెల్లి కూడా జోక్యం చేసుకొని కులాన్ని టార్గెట్ చేసుకుంటే ఊరుకోనని చంద్రబాబుకు కూడా చెప్పారు. తదనంతర క్రమంలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లి బెయిల్‌పై రావడం, ఆ తరువాత రేవంతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవడంతో ఎర్రబెల్లి ప్రాధాన్యత తగ్గింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు వరంగల్ ఉప ఎన్నిక విషయంలో ఎర్రబెల్లి, రేవంత్‌ల మధ్య వివాదాలు రేగాయి. ఇక ఇప్పుడు ఆయన గురించి మాట్లాడేవారే లేకుండా పోయారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎర్రబెల్లిని టికెట్లు అడిగిన వారు లేరు, ఆయన సిఫారసు చేసిందీ లేదు...!