ఏ పార్టీ గెలిస్తే..ఎవరు మేయర్ అవుతారు?
► కౌన్ హై..మేయర్
► ముందే పావులు కదిపిన కాంగ్రెస్
► మేయర్ అభ్యర్థిగా ముఖేష్ తనయుడు విక్రంగౌడ్
► టీఆర్‌ఎస్ జాబితాలో విజయలక్ష్మీ, రాంమోహన్,జగదీశ్వర్‌గౌడ్
► ఎంఐఎం పరిశీలనలో మాజిద్,నవీన్‌యాదవ్
హైదరాబాద్ సిటీబ్యూరో--- ఏ పార్టీ గెలిస్తే..ఎవరు మేయర్ అవుతారు..డిప్యుటీ మేయర్ అవుతారు..అన్న చర్చ నగరంలో ఊపందుకుంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ గత చరిత్రకు భిన్నంగా ఎన్నికలకు ముందుగానే మేయర్ అభ్యర్థిగా మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు జాంభాగ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూల విక్రంగౌడ్‌ను ప్రకటించింది. దీంతో మిగిలిన అన్ని ప్రధాన పార్టీల్లో చర్చ పలువురు అభ్యర్థుల చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో మరో బలమైన అభ్యర్థి లేకుండా పోవటంతో గోషామహల్ నియోకజవర్గానికి చెందిన విక్రంను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితిలో సైతం మేయర్ అభ్యర్థులెవరన్న పరిశీలన మొదలైంది. బంజారాహిల్స్ డివిజన్ నుండి పోటీ చేసిన ఎంపీ కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మీ,చర్లపల్లి స్థానం నుండి పోటీ చేస్తునన బొంతు రాంమోహన్,మాదాపూర్ డివిజన్ నుండి పోటీచేస్తున్న జగదీశ్వర్‌గౌడ్‌ల చుట్టూ చర్చ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ నుండి టీఆర్‌ఎస్‌లో చేరిన జగదీశ్వర్‌గౌడ్‌కు టీఆర్‌ఎస్ మదాపూర్ నుండి, ఆయన భార్య పూజిత హఫీజ్‌పేట కార్పోరేటర్లుగా పోటీ చేస్తున్నారు.అయితే టీఆర్‌ఎస్ ముందుగానే అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపించటం లేదు. మేయర్ ఎన్నిక రోజే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందని నగరానికి చెందిన సీనియర్ మంత్రి ఒకరు పేర్కొన్నారు.
ఎంఐఎం జాబితాలో మాజిద్,నవీన్ యాదవ్
ఎంఐఎం జాబితాలో మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్, జూబ్లిహిల్స్ నియోజక వర్గ నాయకుడు నవీన్‌యాదవ్‌ల పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నం డివిజన్ నుండి.నవీన్ యాదవ్ రహమత్‌నగర్ డివిజన్ నుండి పోటీ చేస్తున్నారు. అయితే 60 స్థానాలకే పోటీ చేస్తున్న ఎంఐఎం కూడా ముందుగా మేయర్ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ కనిపించటం లేదు. ఎంఐఎం గెలుచుకునే స్థానాలకు తోడు, తమ సహాయం అవసరమైన పార్టీలు ముందుకొచ్చిన తర్వాత మేయర్,డిప్యుటీ మేయర్ పదవులపై చర్చించాలని భావిస్తోంది. తమ మద్దతు కీలకమైతే మేయర్ స్థానాన్ని కోరుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.ఇక తెలుగుదేశం,బీజేపీల్లో ఇంకా మేయర్ ఊసే కనిపించటం లేదు.