ఎవరో... వారెవరో!
జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులపై తొలగని ఉత్కంఠ
బొంతు రాంమోహన్ చుట్టే తిరుగుతున్న చర్చలు
డిప్యూటీ మేయర్ మైనారిటీకి.. ఎన్నిక రోజే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ మేయర్ ఎవరన్న ఉత్కంఠ..మరికొన్ని రోజులు కొనసాగనుంది. ఈనెల 11న ఉదయాన్నే మేయర్, డిప్యూటీ మేయర్ల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉండటంతో ‘ఎవరా..మేయర్ అభ్యర్థి’ అంటూ అధికార టీఆర్‌ఎస్‌లో చర్చలు జోరందుకున్నాయి. బీసీ జనరల్ అభ్యర్థులకు కేటాయించిన మేయర్ స్థానం కోసం పలు విధాల పరిశీలన అనంతరం ఇద్దరి పేర్ల చుట్టే చర్చలు తిరుగుతున్నాయి. అందులో చర్లపల్లి డివిజన్ నుండి కార్పొరేటర్‌గా గెలిచిన బొంతు రాంమోహన్ ఒకరైతే, మరొకరు బంజరాహిల్స్ డివిజన్ నుండి విజయం సాధించిన గద్వాల విజయలక్ష్మి. ఇందులో టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ విద్యార్థి, యువజన విభాగాల అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ, పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు కూడా నమ్మకస్తునిగా పేరొందిన బొంతు రాంమోహన్ వైపే పార్టీ మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మున్సిపల్ పరిపాలనా బాధ్యతలు కేటీఆర్‌కు అప్పచెప్పిన దృష్ట్యా, ఆయనతో సులువుగా కలిసిపోయే వ్యక్తులుండటమే ఉత్తమమన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి సైతం మేయర్ పీఠంపై ఆశలు పెంచుకున్నారు. ఎక్కువ కాలం అమెరికాలో ఉండివచ్చిన ఆమె ఉన్నత విద్యావంతురాలు కూడా. అయితే తెలంగాణ కేబినెట్‌లో మహిళలెవరూ లేకపోవటం, హైదరాబాద్ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసే దిశగా విశాల దృక్పథం ఉన్న వ్యక్తి కావటంతో ఆమె పేరును అంత సులువుగా తీసేసే అవకాశం లేదన్న మరో వాదన వినిపిస్తుంది. అయితే ఈ విషయంలో తనంత తానుగా వెళ్లి మేయర్ అభ్యర్థిపై చర్చించకూడదని, ఎంపీ కేశవరావు నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ఎవరిని నిర్ణయించినా తాను సమర్థించాలన్న నిర్ణయంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
మైనారిటీకి డిప్యూటీ మేయర్
ఎన్నికలకు ముందు తమకు ఎంఐఎం మిత్రపక్షమని ప్రకటించిన టీఆర్‌ఎస్ ప్రస్తుతం సంపూర్ణ మెజారిటీ ఉన్నందున ఆ పార్టీని దూరం పెట్టే అవకాశమే ఉందని సమాచారం. తమ పార్టీ తరపున గెలిచిన ఆరుగురు మైనారిటీ కార్పొరేటర్లలో ఒకరిని డిప్యుటీ మేయర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. వారిలో బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
సీఎంను కలిసిన రాంమోహన్, విజయలక్ష్మి
కార్పొరేటర్లు బొంతు రాంమోహన్, గద్వాల విజయల క్ష్మిలు ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ ఎన్నికకు సంబంధించిన చర్చలేవీ రాలేదని సమాచారం.