ఉచితంగా 45 నిమిషాలు వైఫై | WiFi services for free | Sakshi
Sakshi News home page

ఉచితంగా 45 నిమిషాలు వైఫై

Published Wed, Mar 2 2016 8:24 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

ఉచితంగా 45 నిమిషాలు వైఫై

ఉచితంగా 45 నిమిషాలు వైఫై

  • ఉచితంగా వైఫై సేవలు
  • 45 నిమిషాల సదుపాయం
  • 15 రోజుల్లోఅందుబాటులోకి
  • ఏర్పాట్లలో జీహెచ్‌ఎంసీ
  • సిటీ నెటిజన్లకు శుభవార్త. ఇక నగరం నలుమూలలా హ్యాపీగా బ్రౌజింగ్ చేసుకునేందుకు..ఇంటర్నెట్ ఆధారిత సేవలు ఉచితంగా పొందేందుకు జీహెచ్‌ఎంసీ అవకాశం కల్పిస్తోంది. స్మార్ట్ సిటీలో భాగంగా గ్రేటర్ పరిధిలో వంద ప్రాంతాల్లో ఒకే రోజు ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు గ్రేటర్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రజలకు ఇంటర్నెట్ సేవలందిస్తున్న ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లలో పలువురు తాము ఉచిత సేవలందిస్తామని..అనుమతులివ్వాల్సిందిగా జీహెచ్‌ఎంసీని ఆశ్రయిస్తుండటంతో.. వచ్చే 15 రోజుల్లో వంద ప్రాంతాల్లో వీటిని ప్రజలకు అందించాలని అధికారులు భావిస్తున్నారు. 
     
    జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్ కార్యాలయాలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్‌లు, హైకోర్టు ప్రాంగణం, ఇమ్లిబన్, జూబ్లీ బస్టాండ్లు, కేబీఆర్, సంజీవయ్య, వెంగళ్రావు, ఇందిరాపార్కులతో సహ ఆరు ప్రధాన పార్కుల్లో  వైఫై సదుపాయం అందుబాటులోకి తేనున్నారు. వీటితోపాటు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో  మొత్తం వంద ప్రాంతాల్లో ఒకేరోజు వీటిని అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు యోచిస్తున్నారు. రోజుకు 45 నిమిషాలపాటు ఈ ఉచిత సదుపాయం లభిస్తుంది. ఈ ఉచిత సదుపాయంతోపాటు ..ఇప్పటికే ఆయా  ప్రైవేట్ సంస్థలనుంచి ఇళ్లకు ఇంటర్నెట్ ను వినియోగించుకుంటున్నవారు తమ యూజర్ లాగిన్, పాస్‌వర్డ్‌లను వినియోగించుకొని కూడా ఈ వంద స్పాట్లలో వైఫై సదుపాయాన్ని పొందవచ్చు. అయితే  ఈ వినియోగం వారి ఖాతాలో నమోదవుతుంది. 

    ఇప్పటికే మొబైల్ యాప్స్‌ను విస్తృతంగా వినియోగిస్తున్న జీహెచ్‌ఎంసీ.. ప్రజలు ఎక్కడినుంచైనా తమ ఫిర్యాదులు పంపించేందుకు.. పరిష్కారమయ్యిందీ లేనిదీ తెలుసుకునేందుకు కూడా ఈ ఉచిత వైఫై సదుపాయం ఉపయుక్తంగా ఉంటుందని  భావిస్తోంది.  వాట్సప్ ద్వారా రహదారులపై గుంతలు, చెత్త తొలగించని ప్రాంతాలు తదితర ఫిర్యాదులు చేసేందుకు సైతం ఈ ఉచిత వైఫై సేవలు ఉకరించగలవని అంచనా వేస్తున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌లతో సహ నగరంలోని వివిధ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 30 ప్రాంతాల్లో ఇప్పటికే 20 నిమిషాల ఉచిత వై ఫై సదుపాయం క ల్పిస్తుండటం తెలిసిందే. ఇదే తరహాలో మరో వంద ప్రాంతాల్లో ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా 45 నిమిషాలపాటు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
     
    వైఫై ఉంటే..
    ఆన్‌లైన్‌లో అనుసంధానించిన సుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు.వైఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటేచాలు.. మొబైల్ డేటా నెట్‌వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజింగ్ చేసే వీలుంటుంది.  వాట్సప్, ఈ-మెయిల్స్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌ల్లో చాటింగ్ చేయొచ్చు.ఒకే కనెక్షన్‌పై ఒకటి కన్నా ఎక్కువ మంది మాట్లాడుకునే యాక్సెస్ లభిస్తుంది. వైఫైతో ప్రభుత్వ, ప్రైవేటు సేవలే కాకుండా కొన్ని రకాల యాప్స్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు పార్కింగ్ యాప్, గార్బేజ్ యాప్ వంటివి. ఈ యాప్ సేవలతో నగరం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయి. దీని ద్వారా స్మార్ట్‌సిటీగా మారవచ్చునని భావిస్తున్నారు.
     
    లాగిన్ ఇలా..
    ప్రస్తుత బీఎస్‌ఎన్‌ఎల్ సేవల తరహాలోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. అందుకు...స్మార్ట్ ఫోన్‌లో వైఫై ఆప్షన్‌పై క్లిక్‌చేసి మొబైల్ నెంబరును, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్‌మిట్‌చేయాలి.మీ మొబైల్‌కు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎస్‌ఎంఎస్ రూపంలో అందుతాయి.వాటిని  టైప్‌చేసి లాగిన్ కావాలి.
     
    ఇదీ వినియోగం....

    గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 30 ప్రాంతాల్లో బీఎఎస్‌ఎన్‌ఎల్  ద్వారా ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు సగటున వంద జీబీల డేటా వినియోగమవుతోంది. నెక్లెస్‌రోడ్డు, చార్మినార్ తదితర ప్రాంతాల్లో ఈసేవలు వినియోగించుకుంటున్నవారు అధికసంఖ్యలో ఉన్నారు. నెక్లెస్ రోడ్‌లో సగటున 79,076 సెషన్స్ మేర ఉచిత వై-ఫై వినియోగమవుతుండగా,  ట్యాంక్‌బండ్ వద్ద 61,745 సెషన్లమేర ఉచిత వై-ఫై వినియోగించుకుంటున్నారు. కనిష్టంగా బిర్లా ప్లానెటోరియం వద్ద 503 సెషన్స్, నిమ్స్ ఆస్పత్రి వద్ద 580 సెషన్స్ మేర వై-ఫై సేవలను వినియోగించుకుంటున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement