విజయవాడ: రానున్న మూడేళ్లలో విద్యుత్ పంపిణీ నష్టాలను ఏకసంఖ్య (సింగిల్ డిజిట్) స్థాయికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంధనవనరులశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇంధనశాఖ పనితీరు, విద్యుత్ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై గురువారం సీఎంఓలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం లక్ష్యాలను నిర్దేశించారు. వచ్చే మూడు సంవత్సరాలలో పంపిణీ నష్టాలను ఐదుశాతానికి తగ్గించాలని ఆదేశించారు. వినియోగదార్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గింపు అంశంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు.
సరఫరా లోపాల తగ్గింపు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని చంద్రబాబు కోరారు. పంపిణీలో నష్టాలు తగ్గితేనే అంతర్జాతీయ స్థాయిలో విద్యుత్ సరఫరా సాధ్యమన్నారు. గ్రామీణ విద్యుదీకరణను నూటికి నూరు శాతం పూర్తిచేయాలని, గిరిజన ప్రాంతాలలో పూర్తి లక్ష్యాలను సాధించాలన్నారు. వచ్చే రెండేళ్లలో పంపిణీ నష్టాలు తగ్గించటానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా (హైఓల్టేజీ విద్యుత్తు) చేయాలన్నారు. కాల్వలలో నీరు ఆవిరి కాకుండా పంటకాల్వలపై సోలార్ ప్యానెల్స్ బిగించాలని, తద్వారా సోలార్ విద్యుత్ ఉత్పాదనను పెంచవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అన్ని పంటకాల్వలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు మీద కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కోరారు.
ఇంధన వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అజయ్ జైన్, ఏపీ ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ శ్రీ కె. విజయానంద్ ఇంధనశాఖ సాధించిన విజయాలను, మైలురాళ్లను ముఖ్యమంత్రికి వివరిస్తూ..ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిందన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రం 24X7 నిరంతర విద్యుత్ సరఫరాను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉందని, 10.6% గా ఉన్న కొరతను సున్నా స్థాయికి వచ్చిందని చెప్పారు. ఏపీ జెన్‌కో గత రెండేళ్లలో 4,000 మెగావాట్ల అదనపు విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసిందని వివరించారు.
పిజిసీఎల్ (సిటియు) అనుగుల్-శ్రీకాకుళం-వేమగిరి లను కలుపుతూ చేపట్టిన 765 కెవి డబుల్ సర్క్యూట్ (ఈఆర్-ఎస్ఆర్) లైన్ల నిర్మాణం వచ్చే జూన్ కి పూర్తవుతుందని వివరించారు. కర్నూలు జిల్లాలో ఎన్.వి.వి.ఎన్.ఎల్ నెలకొల్పుతున్న 1000 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం గల సోలార్ పార్కుకు ట్రాన్స్ మిషన్ వ్యవస్థను ఏపీ ట్రాన్స్ కో నిర్మిస్తున్నదని వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు.
అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలలో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంగల సోలార్ పార్కులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్జైన్, ట్రాన్స్ కో సీఎండీ కె. విజయానంద్, ఇంధన వనరుల శాఖ సలహాదారు శ్రీ కె.కె. రంగనాథన్, డిస్కమ్స్ సీఎండీలు ఆర్. ముత్యాలరాజు, హెచ్ వై. దొర, ఏపీ సోలార్ పవర్ కార్పోరేషన్ ఎండీ జి. ఆదిశేషు, రాష్ట్ర ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ సీఈఓ ఎ. చంద్రశేఖర రెడ్డి, నెడ్ క్యా జీఎం కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
'నష్టం సింగిల్ డిజిట్కు రావాలి'
Published Thu, Apr 7 2016 7:30 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement