CM review meeting
-
వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్ష
-
కరోనా నివారణ చర్యలపై వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : కోవిడ్ –19 నివారణా చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. కరోనా పట్ల తీవ్ర భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని మరో మారు సీఎం స్పష్టం చేశారు. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపడం సరి కాదన్నారు. వైరస్ పట్ల భయం, ఆందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. వైరస్ పట్ల అవగాహన పెంచుకోవడంతోపాటు, చికిత్స చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కెఎస్.జవహర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగంపై పలువురి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయని అధికారులు ప్రస్తావించారు. కరోనా వైరస్ పట్ల భయాందోళనలు తొలగించాల్సిన అవసరం ఉందన్న మాటపై ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతున్నారని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కూడా తనతో మాట్లాడారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక అంశాలను ప్రస్తావించారంటూ తనతో అన్నారని వైఎస్ జగన్ చెప్పారు. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని సోమవారం డిశ్చార్జి అయిన ఒక ఉద్యోగిని ఇంట్లోకి రానీయలేదన్న అంశాన్ని అధికారులు సీఎం వద్ద ప్రస్తావించారు. కరోనా పట్ల తీవ్ర భయాందోళనల కారణంగా ఇలాంటి వివక్ష చూపిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. తాజాగా 33 పాజిటివ్ కేసులు నమోదు: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కొత్తగా 33 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2051కి చేరుకుంది. గత 24 గంటల్లో 10,730 మంది శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 33 మందికి కరోనా సోకినట్టుగా నిర్థారణ అయింది. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన వారే 20 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీలో 1,91,874 కరోనా పరీక్షలు చేశారు. ప్రతి మిలియన్‌కు 3,594 పరీక్షలు చేశారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.09 శాతం, దేశంలో 4.02శాతంగా ఉంది. మరణాల శాతం రాష్ట్రంలో 2.20, దేశంలో 3.24 శాతంగా ఉంది. రికవరీ రేటు రాష్ట్రంలో 50.55శాతం, దేశంలో 31.86శాతంగా ఉంది. హైరిస్క్ ఉన్న వారు, 60 సంవత్సరాల పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై ప్రత్యేక దృష్టి సారించామని అధికారులు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపైనా దృష్టి పెడుతున్నామన్నారు. కోవిడ్‌యేతర రోగులకు చికిత్సలను సాధారణ స్థాయికి తీసుకురావడంపై దృష్టి పెడుతున్నామన్ని అధికారులు పేర్కొన్నారు. ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలి: మరింత ఉధ్ధృతంగా ధాన్యాన్ని సేకరించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రైతులకు పేమెంట్లు కూడా జరుగుతున్నాయని, అకాల వర్షాలు సంభవిస్తే మార్కెట్లలో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. చేపలు, రొయ్యల ఎగుమతులపై దృష్టిపెట్టాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలు సిద్ధమవుతున్నాయని, ఈనెల 30న వాటిని ప్రారంభించడానికి సిద్ధమని అధికారులు తెలిపారు. ఆర్బీకేలలో ఈనెల 15వ తేదీకల్లా కియోస్క్‌లు రెడీ అవుతాయన్నారు. రైతు భరోసాకు సన్నద్ధమవుతున్నామని అధికారులు పేర్కొన్నారు. -
ఒంటమిట్ట: అధికారులపై సీఎం అసహనం
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా తీవ్ర అపశ్రుతి చోటుచేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్టలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఈ సందర్భంగా అధికారులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఒంటిమిట్టలో శుక్రవారం శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సమయంలో భారీ వర్షం కురువడంతో నలుగురు మృతిచెందారు. మరో 80 మంది దాకా గాయాల పాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరాముడు–సీతమ్మల వివాహం సందర్భంగా వెలుగులతో కళకళలాడాల్సిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వరుణదేవుడి ప్రతాపానికి అంధకారంగా మారింది. శుక్రవారం ఒంటిమిట్ట ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. వెనువెంటనే ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన మొదలైంది. గంటకుపైగా కుండపోత వర్షం కురిసింది. ఒకవైపు విపరీతమైన గాలులు, మరోవైపు ఉరుముల శబ్దాలతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. కల్యాణోత్సవం కోసం ఏర్పాటు చేసిన ఫోకస్ లైట్ల స్తంభాలు, డెకరేషన్ లైట్లతో అలంకరించిన బొమ్మలు ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి. చలువ పందిళ్లకు వేసిన టెంట్లు, రేకులు కూడా లేచిపోయాయి. వడగండ్లు రేకులపై పడుతుండడంతో భక్తులు భయకంపితులయ్యారు. కోదండ రామస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న వేపచెట్లు నేలకూలగా, అక్కడే ఉన్న చలువ పందిరి కూలిపోయింది. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో అంధకారం నెలకొంది. ప్రాణాలు తీసిన లైట్లు: ఆలయ సమీపంలో కల్యాణోత్సవం వేదిక రేకులు కూలిపోయి నలుగురు మృత్యువాత పడ్డారు. బద్వేలు ఎస్సీ కాలనీకి చెందిన చిన్నయ్య(48) మృతి చెందాడు. ఫోకస్ లైట్లు మీద పడడంతో పోరుమామిళ్లకు చెందిన చెంగయ్య(70) అనే వృద్ధుడు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఒంటిమిట్టకు చెందిన వెంకట సుబ్బమ్మ(65) అనే భక్తురాలు దక్షిణ గోపురం వద్ద కొయ్యలు మీదపడటంతో మృతి చెందారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టణానికి చెందిన మీనా(45) రాములోరి కల్యాణానికి వచ్చి గాయపడి, తుదిశ్వాస విడిచారు. వడగళ్ల వానకు రేకులు గాలికి లేచి పడడం, విరిగిన చెట్లు తగలడం, డెకరేషన్ లైట్లు మీదపడడం వంటి కారణాలతో దాదాపు 80 మంది గాయపడ్డారు. అందులో 25 మందిని కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐదుగురిని తిరుపతికి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 6.30 సమయంలో విద్యుత్ నిలిపివేయడంతో అప్పటి నుంచి రాత్రి 9.30 వరకు ఆలయం అంధకారంలోనే ఉండిపోయింది. -
'నష్టం సింగిల్ డిజిట్‌కు రావాలి'
విజయవాడ: రానున్న మూడేళ్లలో విద్యుత్ పంపిణీ నష్టాలను ఏకసంఖ్య (సింగిల్ డిజిట్) స్థాయికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంధనవనరులశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇంధనశాఖ పనితీరు, విద్యుత్ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై గురువారం సీఎంఓలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం లక్ష్యాలను నిర్దేశించారు. వచ్చే మూడు సంవత్సరాలలో పంపిణీ నష్టాలను ఐదుశాతానికి తగ్గించాలని ఆదేశించారు. వినియోగదార్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గింపు అంశంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. సరఫరా లోపాల తగ్గింపు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని చంద్రబాబు కోరారు. పంపిణీలో నష్టాలు తగ్గితేనే అంతర్జాతీయ స్థాయిలో విద్యుత్ సరఫరా సాధ్యమన్నారు. గ్రామీణ విద్యుదీకరణను నూటికి నూరు శాతం పూర్తిచేయాలని, గిరిజన ప్రాంతాలలో పూర్తి లక్ష్యాలను సాధించాలన్నారు. వచ్చే రెండేళ్లలో పంపిణీ నష్టాలు తగ్గించటానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా (హైఓల్టేజీ విద్యుత్తు) చేయాలన్నారు. కాల్వలలో నీరు ఆవిరి కాకుండా పంటకాల్వలపై సోలార్ ప్యానెల్స్ బిగించాలని, తద్వారా సోలార్ విద్యుత్ ఉత్పాదనను పెంచవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అన్ని పంటకాల్వలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు మీద కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కోరారు. ఇంధన వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అజయ్ జైన్, ఏపీ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ శ్రీ కె. విజయానంద్ ఇంధనశాఖ సాధించిన విజయాలను, మైలురాళ్లను ముఖ్యమంత్రికి వివరిస్తూ..ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిందన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రం 24X7 నిరంతర విద్యుత్ సరఫరాను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉందని, 10.6% గా ఉన్న కొరతను సున్నా స్థాయికి వచ్చిందని చెప్పారు. ఏపీ జెన్కో గత రెండేళ్లలో 4,000 మెగావాట్ల అదనపు విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసిందని వివరించారు. పిజిసీఎల్ (సిటియు) అనుగుల్-శ్రీకాకుళం-వేమగిరి లను కలుపుతూ చేపట్టిన 765 కెవి డబుల్ సర్క్యూట్ (ఈఆర్-ఎస్ఆర్) లైన్ల నిర్మాణం వచ్చే జూన్ కి పూర్తవుతుందని వివరించారు. కర్నూలు జిల్లాలో ఎన్.వి.వి.ఎన్.ఎల్ నెలకొల్పుతున్న 1000 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం గల సోలార్ పార్కుకు ట్రాన్స్ మిషన్ వ్యవస్థను ఏపీ ట్రాన్స్ కో నిర్మిస్తున్నదని వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలలో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంగల సోలార్ పార్కులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్‌జైన్, ట్రాన్స్ కో సీఎండీ కె. విజయానంద్, ఇంధన వనరుల శాఖ సలహాదారు శ్రీ కె.కె. రంగనాథన్, డిస్కమ్స్ సీఎండీలు ఆర్. ముత్యాలరాజు, హెచ్ వై. దొర, ఏపీ సోలార్ పవర్ కార్పోరేషన్ ఎండీ జి. ఆదిశేషు, రాష్ట్ర ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ సీఈఓ ఎ. చంద్రశేఖర రెడ్డి, నెడ్ క్యా జీఎం కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
'త్వరలో నీలం తుఫాన్ ఇన్పుట్ సబ్సిడి విడుదల'
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో సీఎం కిరణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశానికి రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, రఘువీరా రెడ్డి తదితరులు హాజరయ్యారు. డిసెంబర్ 10లోగా హెలెన్, లెహర్ తుఫాన్ నష్ట తీవ్రతపై అంచనా నివేదికలను పంపాలని సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను రఘువీరా రెడ్డి ఆదేశించారు. నీలం తుఫాన్ ఇన్పుట్ సబ్సిడి రూ. 437 కోట్లు పెండింగ్‌లో ఉందని, రెండు రోజుల్లో ఆ సబ్సిడిని విడుదల చేస్తామని రఘువీరా రెడ్డి తెలిపారు. -
వర్షాలు, వరదలపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సమీక్షించారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు...ఈరోజు ఉదయం సీఎస్ మహంతికి ఫోన్ చేసి సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. ప్రకాశం జిల్లాలో వెదురురాళ్లపాడు వద్ద వరద నీటిలో చిక్కుకున్న ప్రయాణికులను హెలికాప్టర్ ద్వారా రక్షించవలసిందిగా సూచించారు. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి పంటలన్నీ కుదేలయ్యాయి. రైతన్నను మళ్లీ కష్టాల కడలిలోకి నెట్టేశాయి.పాలుపోసుకుంటున్న వరి కంకులు.. తొలి కోతకు విచ్చుకుంటున్న పత్తి చేలు.. చేతిదాకా వచ్చిన మొక్కజొన్న... మార్కెట్ యార్డులకొచ్చిన ధాన్యం బస్తాలు.. ఒకటేమిటి కర్షకుడు కాయకష్టం చేసి కన్నబిడ్డలా పెంచుకున్న పంటలన్నీ నిలువెల్లా నీట మునిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న మరింత తీవ్రమైన నేపథ్యంలో రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అయితే ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం పంట నష్టం 7 లక్షల ఎకరాలకుపైగానే ఉంటుందని అంచనా. -
బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గంటా శ్రీనివాసరావు, బాలరాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఉల్లిపాయలు సహా కూరగాయల ధరల పెరుగుదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సమీక్ష నిర్వహించారు. ధరల తగ్గింపుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సీఎం ఈ సందర్భంగా సీఎస్‌ను ఆదేశించారు. అలాగే సీమాంధ్రలో సకల జనుల సమ్మె, వరదలుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.