కరోనా నివారణ చర్యలపై వైఎస్‌ జగన్‌ సమీక్ష | AP CM YS Jagan Mohan reddy review on Corona virus | Sakshi
Sakshi News home page

కరోనా నివారణ చర్యలపై వైఎస్‌ జగన్‌ సమీక్ష

Published Tue, May 12 2020 2:49 PM | Last Updated on Tue, May 12 2020 5:01 PM

AP CM YS Jagan Mohan reddy review on Corona virus - Sakshi

సాక్షి, అమరావతి :  కోవిడ్‌ –19 నివారణా చర్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. కరోనా పట్ల తీవ్ర భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని మరో మారు సీఎం స్పష్టం చేశారు. వైరస్‌ సోకిన వారి పట్ల వివక్ష చూపడం సరి కాదన్నారు. వైరస్‌ పట్ల భయం, ఆందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. వైరస్‌ పట్ల అవగాహన పెంచుకోవడంతోపాటు, చికిత్స చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కెఎస్‌.జవహర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇతర సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ప్రసంగంపై పలువురి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయని అధికారులు ప్రస్తావించారు. కరోనా వైరస్‌ పట్ల భయాందోళనలు తొలగించాల్సిన అవసరం ఉందన్న మాటపై ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతున్నారని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ కూడా తనతో మాట్లాడారని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక అంశాలను ప్రస్తావించారంటూ తనతో అన్నారని వైఎస్‌ జగన్‌ చెప్పారు. కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని సోమవారం డిశ్చార్జి అయిన ఒక ఉద్యోగిని ఇంట్లోకి రానీయలేదన్న అంశాన్ని అధికారులు సీఎం వద్ద ప్రస్తావించారు. కరోనా పట్ల తీవ్ర భయాందోళనల కారణంగా ఇలాంటి వివక్ష చూపిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు.

తాజాగా  33 పాజిటివ్‌ కేసులు నమోదు:
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కొత్తగా 33 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2051కి చేరుకుంది. గత 24 గంటల్లో 10,730 మంది శాంపిల్స్‌ పరీక్షించగా.. అందులో 33 మందికి కరోనా సోకినట్టుగా నిర్థారణ అయింది.  తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన వారే 20 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీలో 1,91,874 కరోనా పరీక్షలు చేశారు. ప్రతి మిలియన్‌కు 3,594 పరీక్షలు చేశారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.09 శాతం, దేశంలో 4.02శాతంగా ఉంది. మరణాల శాతం రాష్ట్రంలో 2.20, దేశంలో 3.24 శాతంగా ఉంది. రికవరీ రేటు రాష్ట్రంలో 50.55శాతం, దేశంలో 31.86శాతంగా ఉంది.

హైరిస్క్‌ ఉన్న వారు,  60 సంవత్సరాల పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై ప్రత్యేక దృష్టి సారించామని అధికారులు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపైనా దృష్టి పెడుతున్నామన్నారు. కోవిడ్‌యేతర రోగులకు చికిత్సలను సాధారణ స్థాయికి తీసుకురావడంపై దృష్టి పెడుతున్నామన్ని అధికారులు పేర్కొన్నారు. 


ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలి:
మరింత ఉధ్ధృతంగా ధాన్యాన్ని సేకరించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. రైతులకు పేమెంట్లు కూడా జరుగుతున్నాయని, అకాల వర్షాలు సంభవిస్తే మార్కెట్లలో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. చేపలు, రొయ్యల ఎగుమతులపై దృష్టిపెట్టాలని సూచించారు.

రైతు భరోసా కేంద్రాలు సిద్ధమవుతున్నాయని, ఈనెల 30న వాటిని ప్రారంభించడానికి సిద్ధమని అధికారులు తెలిపారు. ఆర్‌బీకేలలో ఈనెల 15వ తేదీకల్లా కియోస్క్‌లు రెడీ అవుతాయన్నారు. రైతు భరోసాకు సన్నద్ధమవుతున్నామని అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement