వర్షాలు, వరదలపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సమీక్షించారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు...ఈరోజు ఉదయం సీఎస్ మహంతికి ఫోన్ చేసి సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. ప్రకాశం జిల్లాలో వెదురురాళ్లపాడు వద్ద వరద నీటిలో చిక్కుకున్న ప్రయాణికులను హెలికాప్టర్ ద్వారా రక్షించవలసిందిగా సూచించారు.
ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి పంటలన్నీ కుదేలయ్యాయి. రైతన్నను మళ్లీ కష్టాల కడలిలోకి నెట్టేశాయి.పాలుపోసుకుంటున్న వరి కంకులు.. తొలి కోతకు విచ్చుకుంటున్న పత్తి చేలు.. చేతిదాకా వచ్చిన మొక్కజొన్న... మార్కెట్ యార్డులకొచ్చిన ధాన్యం బస్తాలు.. ఒకటేమిటి కర్షకుడు కాయకష్టం చేసి కన్నబిడ్డలా పెంచుకున్న పంటలన్నీ నిలువెల్లా నీట మునిగాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న మరింత తీవ్రమైన నేపథ్యంలో రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అయితే ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం పంట నష్టం 7 లక్షల ఎకరాలకుపైగానే ఉంటుందని అంచనా.