
పోలీసుల అదుపులో కి'లేడీ' శైలు
అమీర్‌పేట: కూలిపని చేసుకొనే ఓ మహిళ ఏకంగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌నని అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతోంది. అంతేకాకుండా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఈ కి ‘లేడీ’ తనను వేధిస్తున్నారని కేసులు పెట్టి భర్తలను కోర్టుల చుట్టూ తిప్పుతోంది. ఆస్తి కోసం బంధువులు తనను చంపేందుకు యత్నిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నిత్య ఆమెను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ జి.వి.రమణగౌడ్ కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాండ్ర హేమ అలియాస్ శైలు,అలియాస్ రాణి,బుజ్జి అలియాస్ అలేఖ్యారెడ్డి, అలియాస్ హేమలత బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి సరూర్‌నగర్‌లో ఉంటూ కూలిపని చేస్తోంది. ఎల్‌బీనగర్‌కు చెందిన రవీంద్రను వివాహం చేసుకుంది.కొద్ది కాలంపాటు అతడితో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన హేమలత భర్త వేధిసున్నాడంటూ కేసు పెట్టింది. అనంతరం మోతీనగర్, బోరబండ ప్రాంతానికి వచ్చి జగదీష్‌ను రెండో పెళ్లి చేసుకుని అతడిపై కూడా కేసుపెట్టింది. పూర్ణచందర్‌ను మూడోపెళ్లి, చివరగా కరీంనగర్‌కు చెందిన కిషోర్‌ను నాలుగో పెళ్లి చేసుకుంది.
ఇటీవల అతనిపై వేధింపుల కేసుపెట్టి దూరంగా ఉంటుంది. తరుచూ వివాహాలు చేసుకుంటూ తనను వేధిస్తున్నారంటూ భర్తలపై కేసులు పెడుతూ వస్తున్న హేమ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, ఆర్‌ఐగా పరిచయం చేసుకుని పలువురిని మోసం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజీవ్ గృహకల్ప పథకం కింద ఇప్పిస్తానని చాలామంది వద్ద నుంచి భారీమొత్తంలో డబ్బులు వసూళు చేసింది. చివరకు మోసపోయామని భావించిన బాధితులు హేమలతపై పోలీసు కేసులుపెట్టారు. నగరంలోని ఆరు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఓ కేసులో ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపారు.
ఫిర్యాదు చేసేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన కిలేడీ
హేమలత ఆస్థికోసం బంధువులు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎస్‌ఆర్‌నగర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చి పోలీసులకు చిక్కింది. పశ్చిమ మండలం డీసీపీ వద్దకు వెళ్లి తనకు కోట్ల రూపాయల ఆస్థి ఉందని మామయ్య, బాబాయ్‌లు తనను చంపేందుకు పథకం వేశారని చెప్పింది. డీసీపీ దీనిపై విచారణ చేయాలని పోలీసులను ఆదేశించి ఎస్‌ఆర్‌నగర్‌కు వెళ్లాలని ఆమెకు సూచించారు.
ఉదయం స్టేషన్ వచ్చిన హేమలత జాయింట్ కలెక్టర్‌గా పరిచయం చేసుకోవడంతో ఆమెకు సెల్యూట్ కొట్టి రాచమర్యాదలు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న సైదులు గతంలో కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన సమయంలో ఉద్యోగాల పేరుతో హేమలత మోసం చేసిందంటూ కొందరు కేసుపెట్టేందుకు వచ్చినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆమెపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తర లించారు. హేమను అరెస్టు విషయాన్ని తెలుసుకున్న బాధితులు సనత్‌నగర్, ఎస్‌నగర్ స్టేషన్‌లలో కేసులు పెట్టేందుకు వచ్చారు.