
ఏయిర్ పోర్టుకు వెళ్లి వస్తూ..
శంషాబాద్: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ఫరీన్ అతిలి(28), ఆమె కుమారుడు బురామ్(8), బంధువు విరాసిద్దీన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంధువులకు వీడ్కోలు పలకడానికి గురువారం సాయంత్రం వచ్చారు. తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు.
కాగా మార్గమధ్యలో కిషన్‌గూడ ప్లై ఓవర్ వద్ద ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో ఫరీన్‌అతిలి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా ఇద్దరికి స్వల్పగాయాలు కావడంతో 108 అంబులెన్స్ వాహనంలో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.