విలేకరులతో మాట్లాడుతున్న ఎంఆర్‌ఆర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బంగారం అక్రమ రవాణాలో హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కస్టమ్స్ విభాగం కమిషనర్ ఎంఆర్‌ఆర్ రెడ్డి వెల్లడించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 40 కేజీల పసిడి స్వాధీనం చేసుకోగా.. గత నెల 1 నుంచి మంగళవారం వరకు 10 కేజీలు చిక్కినట్లు తెలిపారు. నిరుపేదల్ని పావులుగా మార్చుకుని యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగిస్తున్నారని, మరికొందరు కమీషన్ కోసం క్యారియర్లుగా మారుతున్నారని అన్నారు. అదనపు కమిషనర్ మంజుల హోస్మానీ, డిప్యూటీ కమిషనర్ కల్యాణ్ రేవెళ్లతో కలసి శంషాబాద్‌లోని కస్టమ్స్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎంఆర్‌ఆర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కొందరు స్మగ్లర్లు వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తూ భారీ స్థాయిలో బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్–దుబాయ్‌ల్లో బంగారం ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం నేపథ్యంలో ఈ దందాకు దిగుతున్నారు. నేరుగా దిగుమతి చేసుకుంటే 38.5 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉండటంతో స్మగ్లింగ్‌కు తెగబడుతున్నారు. అయితే ఎక్కడా వీళ్లు నేరుగా సీన్‌లోకి రావట్లేదు. ఆయా దేశాల నుంచి వస్తున్న కొందరు యువతను కమీషన్ పేరుతో ఆకర్షిస్తున్న స్మగ్లర్లు తమ తరఫున పనిచేసేలా చేసుకుంటున్నారు. అలాగే దుబాయ్ తదితర దేశాల్లో స్థిరపడిన వారితోనూ ఒప్పందాలు చేసుకుని వారినీ ఈ రొంపిలోకి దింపుతున్నారు. దుబాయ్‌లో ఉంటున్న స్మగ్లింగ్ గ్యాంగ్‌ల సభ్యులు అక్కడి ట్రావెల్ ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
వారి ద్వారా హైదరాబాద్‌కు వెళ్తున్న పేద, మధ్య తరగతి వారిని గుర్తిస్తున్నారు. ఆయా ప్రయాణికుల్ని సంప్రదిస్తున్న ముఠా సభ్యులు తాము అప్పగించిన వస్తువులు తీసుకువెళ్లేలా వారిని ఒప్పిస్తున్నారు. దీనికోసం కొందరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు కమీషన్ ఇస్తుండగా.. మరికొందరికి టికెట్ కొనిస్తున్నారు. సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలిచే వీరిలో అత్యధికులకు తాము పసిడి తీసుకువస్తున్నామని తెలియట్లేదు. అలా ఉండేందుకు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చేసి వీరికి అప్పగిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక వీరిని రిసీవ్ చేసుకునేది ఎవరో, వారి కాంటాక్ట్ నంబర్లు ఏమిటో చెప్పరు. అలా చేస్తే కస్టమ్స్ తనిఖీల్లో వీరు చిక్కితే ముఠా గుట్టురట్టవుతుందని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరి ఫొటోలను మాత్రం వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉంటున్న రిసీవర్లకు పంపుతున్నారు’ అని అన్నారు.
ఇవీ గణాంకాలు: 2018–19 ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్ అధికారులు 86 స్మగ్లింగ్ కేసుల్ని గుట్టురట్టు చేశారు. వీరి నుంచి రూ.12 కోట్లకు పైగా విలువైన 40 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అరె స్టు అయిన వారిలో 20 మంది భారతీయులు, ఒక విదేశీయుడు ఉన్నారు. గత నెల 1 నుంచి మంగళవారం వరకు 14 కేసులు నమోదయ్యాయి. ఐదుగురిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు వీరి నుంచి రూ.3 కోట్ల విలువైన 10 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
పురుషులు 20, మహిళలు 40 గ్రాములు
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం విషయంలో తప్పక రూల్స్ పాటించాలని ఎంఆర్‌ఆర్ రెడ్డి తెలిపారు. విదేశాల నుంచి వచ్చే పురుషులు 20 గ్రాములు, మహిళలు 40 గ్రాముల బంగారాన్ని తమ వెంట తీసుకురావచ్చని అన్నారు. ఎక్కువ మోతాదులో బంగారం తెస్తుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ విభాగానికి చెందిన రెడ్ చానల్‌లో డిక్లేర్ చేసి పన్ను చెల్లించాలని చెప్పారు. రూ.20 లక్షలకు మించి విలువైన బంగారంతో పట్టుబడితే అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment