జగన్నాథ నాయుడు-విజయారెడ్డి
హైదరాబాద్ : అంబర్‌పేట బాపూనగర్‌కు చెందిన సునీత దారుణ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ పి.వెంకటరమణ కథనం ప్రకారం... బాపూనగర్‌లో ఉంటున్న కొట్లూరి కృష్ణ, రామంతాపూర్ ప్రశాంతనగర్, సరస్వతి బ్లాక్‌లో ఉంటున్న కల్లు విజయారెడ్డి కలిసి కొన్నేళ్ల క్రితం ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏర్పాటు చేశారు. బీబీనగర్, కొండమడుగులో కూడా వీకే డ్రగ్స్ పేరిట కంపెనీ స్థాపించారు. ఈ కంపెనీలకు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ఫైనాన్స్ కంపెనీలో రూ. కోటి, బ్యాంకులో రూ. 3 కోట్లు రుణం తీసుకున్నారు.
ఆ తర్వాత కృష్ణ, విజయారెడ్డిల మధ్య విభేదాలు తలెత్తాయి. వీటిని మధ్యవర్తులు, లా బోర్డు ద్వారా పరిష్కరించుకున్నప్పటికీ కృష్ణపై విజయారెడ్డి కక్ష పెంచుకుంది. తనకు పరిచయమైన పార్ట్‌టైమ్ పోలీసు రైటర్ జగన్నాథనాయుడుతో కలిసి కృష్ణ కూతురు శ్రావణిని చంపాలనుకుంది. అయితే వీలు కాకపోవడంతో గతనెల 16న కృష్ణ భార్య సునీతను జగన్నాథనాయుడు కారులో తాను ఉంటున్న అత్తాపూర్‌కు తీసుకెళ్లి చీరకొంగును మెడకు చుట్టి హత్య చేశాడు. అనంతరం సునీత మృతదేమాన్ని ముక్కలు ముక్కలుగా కోసి.. గోనె సంచుల్లో పెట్టి మూసీలో పడేసిన విషయం విదితమే.
అయితే కృష్ణ గతనెల 18న తన భార్య కనిపించడం లేదని అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు జగన్నాథనాయుడు హత్య చేసినట్లు తెలిసింది. దీనికి ప్రధాన సూత్రధారి విజయారెడ్డి అని కూడా గుర్తించారు. దీంతో పోలీసులు నిన్న జగన్నాథనాయుడు, విజయారెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.