సాక్షి, హైదరాబాద్: పుట్టబోయే శిశువు లింగ నిర్ధారణ చేసే హక్కు తల్లిదండ్రులకు ఉండాలన్న కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకాగాంధీ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉస్తేల సృజన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైపు దేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతుండగా కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సోమవారం పేర్కొన్నారు. 2011లో ప్రతి వెయ్యి మంది మగవారికి 914 మంది ఆడవారున్నారని, ఈ నిష్పత్తి 2014 వచ్చేసరికి మరింత తగ్గిందన్నారు. మనేకాగాంధీ వ్యాఖ్యల ప్రభావంతో భ్రూణహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.