అన్నదమ్ముల మధ్యలో జోక్యం చేసుకున్న పక్కింటి యువకుడు వారి చేతిలో కత్తిపోట్లకు గురయ్యాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరేణి కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు... బ్లాక్‌నెంబర్ 52లో శోభ అనే మహిళ తన కుమారులు నాగరాజు, మధుతో కలసి నివసిస్తోంది.
మధు ప్లంబర్‌గా పనిచేస్తుండగా నాగరాజు మద్యం, గంజాయి వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ తల్లితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో నాగరాజు తల్లితో గొడవ పడుతుండగా తమ్ముడు మధు అడ్డుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో పక్కింట్లో ఉండే కిరణ్ వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. తమ గొడవలో ఎందుకు జోక్యం చేసుకుంటావని ఆగ్రహంతో కిరణ్‌పై నాగరాజు కత్తితో దాడి చేశాడు. కిరణ్ భుజం, చేతికి కత్తిపోట్ల కారణంగా గాయాలు కావడంతో అతడ్ని చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.