ఉద్యోగ భాగ్యం..
• ఉద్యోగం చేయడానికి యువత ప్రాధాన్యమిచ్చే టాప్-10లో భాగ్యనగరానికి చోటు
• సాఫ్ట్‌వేర్, ఐటీ, బీపీవో, ఇంజనీరింగ్ ఏదైనా ఇక్కడే ‘వెస్ట్’ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : ఎక్కడైనా సరే ఉద్యోగం వస్తే చాలు.. అనే పరిస్థితి ఇప్పుడు లేదు. చేసే ఉద్యోగంతోపాటు పని చేయాల్సిన ప్రాంతానికీ యువత ప్రాధాన్యం ఇస్తోంది. సాఫ్ట్‌వేర్, ఐటీ, ఇంజనీరింగ్, ఆటోమోటివ్ ఇలా ఏ రంగమైనా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అలా యువత ప్రాధాన్యమిచ్చే టాప్-10 నగరాల్లో మన హైదరాబాద్ చోటు సంపాదించింది. ఇండియా స్కిల్స్ రిపోర్టు-2016 ఈ విషయాన్ని వెల్లడించింది. పీపుల్ స్ట్రాంగ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, లింక్‌డ్‌ఇన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ‘వీబాక్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్ టెస్టు (వెస్ట్)’ పేరుతో దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5.2 లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. 2014, 2015, 2016 సంవత్సరాల్లో ఈ సర్వేను నిర్వహించింది.
సర్వేలోని మరిన్ని అంశాలు
ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల్లో ఎక్కువ మందికి 22 -25 ఏళ్ల వయసులోనే ఉద్యోగాలు లభిస్తున్నట్లు వెస్ట్ అధ్యయనంలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 31.59 శాతం మంది ఆ వయసులోనే ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పారు.
⇒ చండీగఢ్, జార్ఖండ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో, ఉత్తరాంచల్, హరియాణా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల వారికి 26 -29 ఏళ్లలో ఉద్యోగాలు లభిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
⇒ ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, గుజరాత్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, హరియాణా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో 18-21 ఏళ్ల వయసు వారికి కూడా ఉద్యోగాలు లభిస్తున్నట్లు వెల్లడించింది.
⇒ కార్పొరేట్ సంస్థలు తమ సంస్థల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే ఎక్కువ శాతం మహిళలను తీసుకుంటున్నాయి.
⇒ సర్వేలో పాల్గొన్న వారిలో 69 శాతం మంది అప్రెంటిస్‌షిప్ విధానం ఉండాలని కోరుకుంటున్నారు.
⇒ తక్కువ వేతనం అయినా ఫరవాలేదు.. ఉద్యోగం కావాలని కోరుకుంటున్న వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు.
మొదటి ప్రాధాన్యం ఢిల్లీకి
బీటెక్, ఫార్మా వంటి వృత్తి విద్య కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఉద్యోగం కోసం ఢిల్లీకి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ చుట్టూ ఉన్న దేశ రాజధాని ప్రాంతం, బెంగళూరు, చెన్నై, లక్నో నిలిచాయి. హైదరాబాద్ పదో స్థానంలో నిలిచింది. అయితే మహిళలు ఉద్యోగం కోరుకుంటున్న టాప్-10 నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం లభించలేదు. ఈ సర్వేలో పాల్గొన్న 5.2 లక్షల మందిలో 38.12 శాతం మంది ఇటీవలే ఉద్యోగాలు పొందిన వారున్నారు. 2014, 2015 సంవత్సరాలతో పోల్చితే 2016లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభించాయి. 2014లో 33.95 శాతం మందికి ఉద్యోగాలు లభించగా, 2015లో 37.22 శాతం మందికి, 2016లో 38.12 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి.