
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంటూ పెళ్లి చేసుకుని..
బంజారాహిల్స్: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువకుడు బీటెక్ చదివానని.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని ఇంటర్ విద్యార్థినిని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. గర్భవతి అయిన భార్యను వదిలి పారిపోయాడు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం... కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని వడ్డేశ్వరం ప్రాంతానికి చెందిన చావలి ఆనంద్‌బాబు అలియాస్ అనిల్(26) ఖమ్మంకు చెందిన ఇంటర్ విద్యార్థిని (19)ను గతేడాది నవంబర్‌లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు.
ఇద్దరూ ప్రేమించుకొని ఏడాది మార్చిలో పెళ్లి చేసుకున్నారు. ఆనంద్‌బాబు ఆ యువతిని నగరంలోని శ్రీకృష్ణానగర్‌కు తీసుకొచ్చి కాపురం పెట్టాడు. అతను నిరుద్యోగని, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాదని, పదో తరగతి ఫెయిల్ అయ్యాడని ఆలస్యంగా ఆ యువతికి తెలిసింది. ఆమె ఒకసారి గర్భదాలిస్తే అబార్షన్ చేయించాడు. మరోసారి గర్భందాల్చిన ఆమెకు ఏడు నెలలకే ఇంట్లోనే పురిటి నొప్పులు రావడంతో మగశిశువు పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చింది. రెండు వారాల క్రితం భార్యకు చెప్పకుండా ఆనంద్‌బాబు ఎటో వెళ్లిపోయాడు. ఫోన్‌చేస్తే స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన ఆమె సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.