*నెహ్రూ జూపార్కులో ఘటన
*అదుపులో అనుమానితుడు
బహదూర్‌పురా: నెహ్రూ జూ పార్కులోని వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి.. అక్కడి పక్షలతో ఫొటోలు దిగడంతో పాటు తాబేలుపై నిలబడి ఫొటో దిగిన దృశ్యాలు ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేయడంతో పాటు ఇంగ్లిషు పత్రికలో రావడం నగరంలో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జి. రామకృష్ణరావు బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.... ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టామని, ఈ ఫొటోల్లోని వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన ఫజల్ షేక్‌గా అనుమానిస్తూ బహదూర్‌పురా పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఫొటోలు గతేడాది జూన్,జులైల్లో దిగి ఉండవచ్చన్నారు.
ఉదయం 9 - 10.30 గంటల మధ్యలో వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లోని వ్యర్థ ఆహార పదార్థాలు, యానిమల్ కీపర్లు తొలగిస్తారని, ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి ఫోటో దిగి ఉండవచ్చన్నారు. జూలోని ఓపెన్ ఎన్‌క్లోజర్ మైదానంలో పక్షులతో పాటు చీతాలు ఉంటాయని, ఇక్కడ కూడా ఫజల్ షేక్ ఫొటో దిగాడన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో జూ పార్కులోని అన్ని ఎన్‌క్లోజర్ల వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేశామన్నారు. వన్యప్రాణుల పట్ల సామరస్యంగా మెలగాలని లేకపోతే అటవీ యాక్ట్ కింద శిక్షకు గురవుతారనే విషయాన్ని మైక్ ద్వారా ప్రచారం చేస్తామన్నారు. కాగా, నెహ్రూ జూ పార్కులోని వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి ఫొటోలు దిగిన ఘటనలో అనుమానితుడు ఫజల్ షేక్ ను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ హరీష్ కౌషిక్ తెలిపారు.